Pawan Kalyan: ‘అజ్ఞాతవాసి’ విడుదల రికార్డుల పండగ అవుతుంది!: తమ్మారెడ్డి భరద్వాజ

  • రికార్డులన్నింటిని ఈ సినిమా బ్రేక్ చేస్తుంది
  • పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు సంతోషకరమైన వార్త
  • ఈరోజు అర్ధరాత్రి నుంచే ‘అజ్ఞాతవాసి’ చూడొచ్చు

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా రూపొందిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సినిమా చూసేందుకు పవన్ అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, ఏపీలో ఈరోజు అర్ధరాత్రి  నుంచే ‘అజ్ఞాతవాసి’ ప్రత్యేక షోలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతించిందని అన్నారు.

టికెట్ ధర కూడా రూ.300, ఆపైన పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించిందని అన్నారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు సంతోషకరమైన వార్త ఏంటంటే, ఈ సినిమాను ఈ అర్ధరాత్రి నుంచే చూసేయొచ్చని, ఎక్కువ థియేటర్లలో ఎక్కువ షోలు వేస్తారు కనుక, బ్లాక్ లో లేదా ఎక్కువ ధరకు టికెట్లు కొనుగోలు చేయక్కర్లేదని, కంగారుపడాల్సిన అవసరం లేదని సూచించారు.

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన్నింటిని ఈ సినిమా బ్రేక్ చేస్తుందని, ‘అజ్ఞాతవాసి’ విడుదల రికార్డుల పండగ అవుతుందని అనుకుంటున్నానని తమ్మారెడ్డి అన్నారు. అమెరికాలో ‘అజ్ఞాతవాసి’ విడుదలైన మొదటిరోజే రెండు మిలియన్లు కలెక్ట్ చేస్తుందని చిత్ర యూనిట్ అంచనాగా ఉందని, సినిమా హిట్ అయితే, ఆ తర్వాత ఇంకెంత కలెక్షన్స్ చేస్తుందో ఓసారి ఊహించుకోవచ్చని అన్నారు. విపరీతమైన క్రేజ్ తో వస్తున్న సినిమా ‘అజ్ఞాతవాసి’ అని, ఇంతకుముందు సినిమాలకు ఏదో ప్రీమియర్ షో అని నిర్వహించి ఒకో టికెట్ రెండేసి, మూడేసి వేల రూపాయలకు విక్రయిస్తుండేవారని ప్రస్తావించారు.

ఈ సినిమాకు ఎక్కువ థియేటర్లను కేటాయించడం, టికెట్ ధర కూడా రూ.300, ఆపైన పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించడంతో అటు ప్రభుత్వానికి, సినీ ఇండస్ట్రీకి, ప్రొడ్యూసర్ కి, సామాన్య ప్రేక్షకుడికి, అభిమానులకు లాభం ఉందని అన్నారు. "మరి పవన్ కల్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమాయేనా? లేక బాలయ్య సినిమా ‘జైసింహా’ కూడా విడుదల కాబోతుందిగా? అనే అనుమానం ప్రేక్షకులకు రావొచ్చు. ఆ సినిమా ఇంకా రెండు రోజులు అయిన తర్వాత కదా విడుదలయ్యేది. ఇవాల్టికి ‘అజ్ఞాతవాసి’ గురించి మాట్లాడుకున్నాం కదా, ‘జైసింహా’ సినిమా గురించి రేపు మాట్లాడుకుందాం’ అంటూ ముగించారు భరద్వాజ.

More Telugu News