Pawan Kalyan: ప్రీమియర్ షో టికెట్లు అమ్మితే క్యాన్సిల్ చేయండి: హైదరాబాద్ భ్రమరాంబ, మల్లికార్జున థియేటర్లకు పోలీసుల నోటీసులు

  • ఇప్పటికే ప్రీమియర్ షోలను రద్దు చేసిన తెలంగాణ పోలీసులు
  • పలు థియేటర్లకు నోటీసులు
  • తలసాని, పోలీసు అధికారుల అపాయింట్ మెంట్ కోరిన నిర్మాతలు

ఒకవైపు ఏపీలో 'అజ్ఞాతవాసి' భారీ స్థాయిలో విడుదలవుతుండగా, తెలంగాణలో మాత్రం ప్రత్యేక ప్రదర్శనలు లేకుండానే రేపు ఉదయం ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే ప్రీమియర్ షోలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన పోలీసులు, ముందస్తు ప్రదర్శనకు టికెట్లు విక్రయించిన హైదరాబాద్ లోని పలు థియేటర్లకు నోటీసులు జారీ చేశారు. కూకట్ పల్లిలోని జంట థియేటర్లు భ్రమరాంబ, మల్లికార్జున ముందుగానే ప్రీమియర్ షో టికెట్లను విక్రయించగా, వాటన్నింటినీ క్యాన్సిల్ చేసి, ప్రేక్షకుల డబ్బులను వెనక్కు ఇచ్చేయాలని ఆదేశించారు.

ఇదే తరహాలో ప్రీమియర్ షోలకు ప్లాన్ వేసిన థియేటర్లన్నింటికీ నోటీసులు పంపారు. ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి లేదని చెబుతూ, నిబంధనలు ఉల్లంఘిస్తే, థియేటర్ లైసెన్స్ ల రద్దు సహా క్రిమినల్ కేసులను ఎదుర్కోవాల్సి వుంటుందని హెచ్చరించారు. హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లా కేంద్రాలు, సినిమా విడుదలవుతున్న అన్ని థియేటర్లకు ఇవే నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు.

 కాగా, ఎలాగైనా ప్రీమియర్ షోలకు అనుమతి సంపాదించుకోవాలన్న ఆలోచనలో ఉన్న చిత్ర యూనిట్, ఈ సాయంత్రంలోగా తమకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులతో పాటు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కోరినట్టుగా తెలుస్తోంది. ఎక్కడా తొక్కిసలాటలు, అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూసుకుంటామన్న హామీని ఇచ్చి, అనుమతి తీసుకునే ఆలోచనలో హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ నిర్మాతలు ఆలోచిస్తున్నట్టు సమాచారం.

More Telugu News