Pakistan: దటీజ్ పాకిస్థాన్! ఉగ్రవాది హఫీజ్ ఫొటోతో కొత్త క్యాలెండర్ రూపొందించిన దినపత్రిక!

  • బయటపెట్టిన పాక్ జర్నలిస్ట్ 
  • ‘మిల్లి ముస్లిం లీగ్’ పార్టీని నెలకొల్పిన ఉగ్రవాది 
  • ఈ ఏడాది ఎన్నికల్లో పోటీ చేయనున్న హఫీజ్

ఉగ్రవాదులకు పాకిస్థాన్ ప్రభుత్వమే కాదు, ఆ దేశ దినపత్రికలు కూడా కొమ్ము కాస్తున్న విషయం మరోమారు తేటతెల్లమైంది. ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాత్-ఉద్-దవా  (జేయూడీ) చీఫ్ హఫీజ్ సయీద్ ఫొటోతో ఓ ఉర్దూ దినపత్రిక కొత్త సంవత్సర క్యాలెండర్‌ను విడుదల చేసింది. పాకిస్థాన్‌కే చెందిన ఓ జర్నలిస్టు ఖురేషీ ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకోవడంతో విషయం వెలుగుచూసింది.

‘‘పాకిస్థాన్‌కు చెందిన ఉర్దూ దినపత్రిక ‘ఖబ్రైన్’ జేయూడీ చీఫ్ ఫొటోతో కొత్త క్యాలెండర్‌ను విడుదల చేసింది’’ అని తన ట్విట్టర్ ఖాతాలో సదరు జర్నలిస్ట్ పేర్కొన్నాడు. హఫీజ్ సయీద్ ఇటీవలే గృహ నిర్బంధం నుంచి బయటపడ్డాడు. ముంబై పేలుళ్ల వెనక అతడి హస్తం ఉందని నిరూపించే ఆధారాలను ప్రభుత్వం సమర్పించలేకపోయిందని పేర్కొన్న పాక్ కోర్టు, అతడిని గృహ నిర్బంధం నుంచి విడిచిపెట్టాల్సిందిగా ఆదేశించింది.

జైలు నుంచి బయటకొచ్చిన హఫీజ్ సయీద్ ‘మిల్లి ముస్లిం లీగ్’ (ఎంఎంఎల్) పేరుతో ఓ పార్టీని స్థాపించాడు. ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేయనున్నట్టు ప్రకటించాడు.

More Telugu News