anchor pradeep: యాంకర్ ప్రదీప్ ను అదేపనిగా మీడియాలో చూపించి ఏం సాధిస్తారు?: తమ్మారెడ్డి భరద్వాజ

  • డ్రంకెన్ డ్రైవ్ అనేది పెద్ద ఇష్యూ కాదు
  • ‘పారిపోయిన ప్రదీప్’, ‘ఆత్మహత్య చేసుకున్న ప్రదీప్’ అనే వార్తలు రాస్తారా?
  • ఎప్పుడూ బాధ్యతగా ఉండాల్సింది ఫోర్త్ ఎస్టేట్
  • ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి

డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ యాంకర్ ప్రదీప్ ను మీడియాలో అదేపనిగా చూపించడం వల్ల ఏం సాధిస్తారని దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రశ్నించారు. తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో ఆయన మాట్లాడుతూ, ‘పట్టుబడ్డ ప్రదీప్ ఇంటి ముందు మీడియాకు సంబంధించిన వారు పదిహేను ఇరవై మంది కాపలా కాసి, అతన్ని ఇంటికి వెళ్లనీయకుండా చేసి, వాళ్ల అమ్మను బాధపెట్టారు.

పోలీస్ స్టేషన్ ముందు కెమెరాలు పెట్టి అతను ఏమైనా వస్తాడేమోనని మీడియా ఎదురుచూసింది.. ప్రదీప్ అనే వాడు డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డాడు. ఆరోజు రెండు వేల మంది పట్టుబడ్డారు. డ్రంకెన్ డ్రైవ్ అనేది పెద్ద ఇష్యూ కాదు. డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ ప్రదీప్ ను మీడియాలో అదే పనిగా చూపించి ఏం సాధిద్దామని? ఆ తర్వాత.. ‘పారిపోయిన ప్రదీప్’, ‘ఆత్మహత్య చేసుకున్న ప్రదీప్’ అని మీడియాలో వార్తలు వచ్చాయి.

ఇలాంటి వార్తలు అవసరమా? ఇది నిజమనుకుని ప్రదీప్ తల్లిదండ్రులు పడే బాధను ఎవరు చూస్తారు? ఆలోచించాల్సిన అవసరం ఎవరికీ లేదా? డ్రంకెన్ డ్రైవ్ తప్పు అనే విషయాన్ని ఎలా తెలియజెప్పాలో అందుకు మనమందరం ప్రయత్నం చేయాలి. ప్రదీప్ లాగా మరెవరూ చేయకూడదనే విషయాన్ని అందరికీ తెలియజెప్పాలి.  ఏ చట్ట ప్రకారం ఒక వ్యక్తి ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ప్రవర్తించగలం? ఒక వ్యక్తి వ్యక్తిగత విషయాలను చూపెట్టగలం?

ప్రదీప్, గజల్ శ్రీనివాస్ లేదా ఇలాంటి వ్యక్తులకు  సంబంధించిన వీడియోలు పోలీసుల దగ్గర ఉంటాయి. అలాంటి వీడియోలు బయటకెలా వస్తున్నాయి? ఎవరు లీక్ చేస్తున్నారు? ఎందుకు లీక్ చేస్తున్నారు? నేరారోపితులైన వ్యక్తులను అపరాధులుగా చూడకూడదు. నిజంగా తప్పు చేసిన వాళ్లను శిక్షించి, వాళ్ల వల్ల ఇలాంటి పరిస్థితి మరొకరికి జరగకుండా బాధ్యతలు మనం తీసుకుంటే బాగుంటుంది.

 అంతేతప్పా, వాళ్ల బలహీనతలను బయటకు చూపించేసి, హైలైట్ చేసి..మన టీఆర్పీలను పెంచుకోవడం కోసం అదే గొప్ప విషయంగా చేసుకోవడం ఎంత వరకు కరెక్టో నాకు తెలియడం లేదు! అర్థం కావట్లేదు! నా ఆలోచనలో ఇదైతే తప్పని భావిస్తున్నాను. ఈ తప్పును కూడా తప్పు అని అనుకుంటే నేనేమీ చేయలేను. ఎందుకంటే, ఎవరి ఇష్టం వాళ్లది. చెయ్యకూడదని చెప్పట్లేదు..అలా చెయ్యడం సమంజసం కాదని చెబుతున్నాను. భవిష్యత్ లో ఇలా జరగకుండా ఉంటే బాగుంటుంది. ఎప్పుడూ బాధ్యతగా ఉండాల్సింది ఫోర్త్ ఎస్టేట్’ అని ఆయన సూచించారు.

More Telugu News