Guntur: కోడి పందేలకు భూములిచ్చినా, కోళ్లకు కత్తి కట్టినా కటకటాలే!

  • కోడి పందేలపై పోలీసుల నజర్
  • వెయ్యిమందికిపైగా నోటీసుల జారీ
  • కోళ్లకు కత్తి కడితే జైలుకు వెళ్లాల్సిందేనంటూ హెచ్చరికలు
  • లంక గ్రామాలపై పోలీసుల ప్రత్యేక దృష్టి

సంక్రాంతి దగ్గర పడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని పల్లెలు పండుగ కోసం ముస్తాబవుతున్నాయి. గుంటూరు జిల్లాలో పందెంరాయుళ్లు కోళ్లను సిద్ధం చేస్తున్నారు. వారికి షాకిచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. కోళ్లకు కత్తి కడితే కటకటాల వెనక్కి పంపేందుకు రెడీగా ఉన్నారు. ఈ మేరకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గతంలో కోళ్ల పందేలు నిర్వహించిన, కోళ్లకు కత్తులు కట్టిన, పందేల నిర్వహణకు భూములు ఇచ్చిన వెయ్యిమందికిపైగా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు.

అంతేకాదు, పోలీసులను గ్రామాలకు పంపి పందెంరాయుళ్ల వివరాలు సేకరిస్తుండడంతో వారి గుండెల్లో గుబులు మొదలైంది. పోలీసుల నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా అడుగు ముందుకు వేస్తే జైలుకు వెళ్లడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. పందేల కోసం రైతులు తమ భూములను ఇవ్వవద్దని కోరుతున్నారు. భూములు అందుబాటులో లేకుంటే పందేల నిర్వహణ అసాధ్యమని, కాబట్టి ఎవరూ భూములు ఇవ్వవద్దని కోరారు.

ఉభయ గోదావరి జిల్లాల తర్వాత కోడి పందేలు ఎక్కువగా జరిగేది గుంటూరు జిల్లాలోనే కావడంతో ఈ జిల్లాపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా లంక గ్రామాలపై ఓ కన్నేశారు. దీంతో రైతులు అప్రమత్తమయ్యారు. పందేలకు భూములిచ్చేందుకు ససేమిరా అంటున్నారు. పందెం కోళ్ల కొనుగోళ్లు కూడా తగ్గినట్టు తెలుస్తోంది.

More Telugu News