జూబ్లీహిల్స్ లో ఘోర ప్రమాదం... మందు కొట్టి కారు నడుపుతూ అమ్మాయిల టూ వీలర్ కు ఢీ.. ఒకరి మృతి!

07-01-2018 Sun 08:48
  • ఎంతగా చెబుతున్నా వినని మందుబాబులు
  • వేగంగా వచ్చి స్కూటీని ఢీకొన్న కారు
  • యువతి మృతి, ఇద్దరమ్మాయిలకు తీవ్ర గాయాలు
మందు కొట్టి వాహనాలను నడపవద్దని పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నా మందుబాబులు మాత్రం ఆగడంలేదు. దీంతో వారి వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతూ, అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తాజాగా, హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో గత రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

 టైలరింగ్ పని చేసుకునే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన అమ్మాయిలు ఓ టూ వీలర్ పై వెళుతుండగా, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లో వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. 'టీఎస్ 09 ఈవీ 7707' నంబర్ గల కారులో వచ్చిన విష్ణువర్ధన్ అనే వ్యక్తి, యాక్సిడెంట్ అనంతరం తప్పించుకునే క్రమంలో కారును వేగంగా పోనిచ్చి, అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మస్తానీ అనే యువతి అక్కడికక్కడే మరణించగా, ప్రియ, అనూష అనే అమ్మాయిలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కారు నడిపిన విష్ణువర్ధన్ ను అరెస్ట్ చేశామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.