Vijayawada: దుర్గమ్మకు అపచారం వెనుక ఆద్యంతమూ సూర్యకుమారి!

  • ప్రధాన అర్చకుడికి ఉద్యోగం ఆశ చూపించిన సూర్యకుమారి
  • ఫోటో తీసి పంపాలని ఆదేశాలు
  • ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న నిజాలు

"కనకదుర్గమ్మకు మహిషాసుర మర్దిని అలంకారం చేయండి. ప్రత్యేక పూజల అనంతరం ఆ ఫోటో తీసి నాకు పంపండి. మీ బంధువుకు దుర్గ గుడిలో ఉద్యోగం ఇప్పిస్తాను" ఇవి ఈఓ సూర్యకుమారి తన మనిషి కోసం అమ్మలగన్న అమ్మకు అపచారం చేయించ తలపెట్టి, ప్రధానార్చకుడు బద్రీనాథ్ తో చెప్పిన మాటలు. డిసెంబర్ 26న అర్థరాత్రి బద్రీనాథ్ తో పాటు మరో ముగ్గురు అమ్మవారికి అలంకరణ మార్చి ప్రత్యేక పూజలు చేసినట్టు వచ్చిన వార్తల వెనుక నిజానిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

ఈ ఘటన వెనుక ఆద్యంతమూ సూర్యకుమారి ఉన్నారని, ఆలయ సెక్యూరిటీ సిబ్బందికి ముందుగానే ఆమె సమాచారం ఇచ్చారని కూడా పోలీసులు తమ నివేదికలో వెల్లడించారు. అమ్మవారికి మహిషాసుర మర్దిని అలంకరణ చేసేందుకు, ఆ అలంకారంలో ఆరితేరిన బద్రీనాథ్ బంధువు పార్ధసారథిని పిలిపించారని, ఇక ఆ ఫోటోను సూర్యకుమారి ఎవరికి పంపాలని భావించారన్న విషయాన్ని తేల్చాల్సి వుందని పోలీసులు అంటున్నారు. ఆలయంలో పూజలు చేస్తున్న వేళ, నాలుగు నిమిషాలకు పైగా సూర్యకుమారి స్వయంగా పూజారులతో మాట్లాడారని పేర్కొన్నారు.

ఇక పూజల తరువాత ఇద్దరు విజయవాడ ఆర్టీసీ బస్టాండులోని డార్మెటరీలో నిద్రించారని, అంతకు ముందు వారు మద్యం, మాంసం తీసుకున్నారని పోలీసులు గుర్తించారు. ఆలయ ప్రధాన అర్చకుడు బద్రీనాథ్‌, చాలా కాలంగా తన బంధువుకు ఆలయంలో ఉద్యోగం ఇప్పించాలని ఈఓ సూర్యకుమారిని అడుగుతున్నారని, ఈ పూజలు చేయిస్తే, ఉద్యోగం ఇప్పిస్తానని ఆమె ఆశ చూపించి ఈ పని చేయించినట్లుగా దర్యాప్తులో వెలుగు చూసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

More Telugu News