durga temple: దుర్గగుడిలో తాంత్రిక పూజలపై ముగిసిన విచారణ... కమిటీ ఏం తేల్చిందంటే...!

  • దుర్గాదేవి శక్తి ముందు తాంత్రిక శక్తులు తట్టుకోలేవన్న కమిటీ
  • మనుష్య సంచారంలో జరగవని వ్యాఖ్య
  • ఆలయం మూసేసిన తర్వాత జరిగే యథావిధి కార్యక్రమాలేనని అభిప్రాయం

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కొన్ని రోజుల క్రితం అర్ధరాత్రి ఆలయం తలుపులు మూసివేసిన తర్వాత తాంత్రిక పూజలు జరిగాయంటూ వచ్చిన వార్తలపై ప్రభుత్వం నియమించిన నిజ నిర్ధారణ కమిటీ తన విచారణను ముగించింది. ఆలయ ప్రధానార్చకులు బద్రీనాథ్ తో పాటు 40 మంది అర్చకులు, ఈవో సూర్యకుమారి నుంచి కమిటీ వివరాలు రాబట్టింది.

ఘటన జరిగిన రాత్రి సీసీటీవీ కెమెరా ఫుటేజీలను సైతం పరిశీలించింది. ప్రతిరోజు అంతరాలయం మూసివేసిన తర్వాత జరిగిన రోజువారీ కార్యక్రమాలేనని చివరకు నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. ఆలయ శుద్ధి కోసమే ప్రధానార్చకులు బద్రీనాథ్, పూజారి రాజాతో కలసి వెళ్లినట్టు తెలిసింది. పూజారి చేతిలో ఉన్నది గుమ్మడికాయ కాదని అవి కొబ్బరికాయలుగా కమిటీ తేల్చింది.

ఈ మేరకు కమిటీ చైర్మన్ రఘునాథ్, ప్రముఖ వేదపండితులు రామశర్మ దీనిపై మీడియాకు కొన్ని వివరాలు అందించారు. అంతరాలయం మూసేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టడం అనాదిగా వస్తున్న ఆచారమని రఘునాథ్ పేర్కొన్నారు. ‘‘లోపల ఏం జరిగిందన్నది సీసీ కెమెరాల్లో ఉండదు. మిగిలిన విషయాలను పరిశీలించాం. ఈ వివరాలను బట్టి ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది. అసలు అమ్మవారి సన్నిధిలో తాంత్రిక పూజలు చేసే ధైర్యం ఎవరికీ లేదు. మనుష్య సంచారం జరిగే చోట ఎక్కడా ఇవి జరగవు. ఊరి బయట, శ్మశానం వంటి చోటే చేస్తారు.

సాక్షాత్తూ దుర్గగుడిలో క్షుద్ర పూజలు చేస్తామంటూ ఒకవేళ ఎవరైనా వస్తే అవి ఎంత వరకూ ఫలిస్తాయి? దుర్గాదేవి శక్తిని తంత్ర శక్తులు ఎంత వరకు తట్టుకోగలవు? అవేమైనా లెంపకాయలు కొడితే వారు ఏమైపోతారు? ఇవన్నీ లోకం గమనించవలసిన అంశాలు. వేద గాయత్రి ఇత్యాది శక్తులున్న చోటకు మంత్ర శక్తులు రాలేవు. మంత్ర పూజలు ఎంత వరకు ఫలిస్తాయన్నది శాస్త్ర రీత్యా సంశయం? తాంత్రికులు దుర్గ గుడికి వెళ్లలేదు. ప్రవేశించడానికి అవకాశం లేదు’’ అని ప్రముఖ వేద పండితులు, కమిటీ సభ్యులు రామ శర్మ వివరించారు.

More Telugu News