Chandrababu: ప్రపంచమంతా మనవైపు చూస్తోంది: చంద్రబాబు

  • జన్మభూమి విజయవంతం అయింది
  • ప్రతి ఒక్కరూ గర్వపడాల్సిన సమయం
  • 80 శాతం సంతృప్తే నా లక్ష్యం
  • టెలీ కాన్ఫరెన్స్ లో ఏపీ సీఎం చంద్రబాబు

తమ ప్రభుత్వం నిర్వహిస్తున్న 'జన్మభూమి-మా ఊరు' కార్యక్రమాన్ని ప్రపంచం మొత్తం చూస్తోందని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఇది ప్రతి ఒక్కరూ గర్వపడాల్సిన సమయమని ఈ ఉదయం విశాఖ నుంచి జన్మభూమి నోడల్ అధికారులు, వివిధ శాఖల అధికారులు, జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో ఆయన వ్యాఖ్యానించారు.

 గత మూడు రోజులుగా జన్మభూమి అద్భుతంగా జరిగిందని, ఇదే స్ఫూర్తిని వచ్చే 7 రోజుల్లోనూ చూపించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. 80 శాతం మంది ప్రజల్లో సంతృప్తిని చూడటమే తన లక్ష్యమని ఆయన అన్నారు. రాబోయే 15 సంవత్సరాల పాటు 15 శాతం జీడీపీ వృద్ధి రేటు సాధించడమే తన ఆకాంక్షని అన్నారు. ఇందుకోసం ప్రతి శాఖలోనూ పనితీరు మెరుగుపడాలని ఆదేశించారు.
 
ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదునూ పరిష్కరించాలని, ఒక్క ఫిర్యాదు కూడా పెండింగ్ లో ఉండేందుకు వీలు లేదని, 11వ తేదీకల్లా అన్ని ఫిర్యాదులనూ పరిష్కరించి చూపాలని చంద్రబాబు ఆదేశించారు. ఉన్నతాధికారులు, ఉద్యోగుల మధ్య మరింత అవగాహన పెరగాల్సివుందని అభిప్రాయపడ్డ చంద్రబాబు, ఫిర్యాదిదారులను గుర్తించేందుకు సాధికార మిత్రుల సాయం తీసుకోవాలని సూచించారు. జనవరి వరకు 7,78,422 ఫిర్యాదులు పెండింగ్ ఉన్నాయని, జన్మభూమి మలివిడత ప్రారంభమైన తరువాత తొలి మూడు రోజుల్లో మరో 3,77,863 ఫిర్యాదులు వచ్చాయని చంద్రబాబు తెలిపారు. పింఛన్ల అర్జీలను త్వరితగతిన అప్ లోడ్ చేయాలని సూచించారు.

More Telugu News