aadhaar: రూ.500 ఇస్తే ఎవరి ఆధార్ సమాచారమైనా వాట్సాప్ లో చూసుకోవచ్చు...! అక్రమార్కుల చేతుల్లోకి ఆధార్ డేటా?

  • వాట్సాప్ వేదికగా కీలక సమాచారం విక్రయం
  • మరో రూ.300 ఇస్తే ఆధార్ కార్డుల ముద్రణ సాఫ్ట్ వేర్
  • బయటపెట్టిన ద ట్రిబ్యూన్

ప్రతీ వ్యక్తికి సంబంధించి అన్ని రకాల వివరాలకు కేంద్రమైన ఆధార్ డేటా అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిందా...? తాజా ఉదంతం చూస్తే ఈ సందేహమే వస్తోంది. ద ట్రిబ్యూన్ పత్రిక స్టింగ్ ఆపరేషన్ తో ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. కేవలం రూ.500కే వాట్సాప్ ద్వారా ఎవరి ఆధార్ వివరాలైనా తేలిగ్గా పొందే అవకాశం ఉందని ఈ సంస్థ పేర్కొంది. కొన్ని వాట్సాప్ గ్రూపులతో ఈ రాకెట్ ఆరు నెలల క్రితమే మొదలైందని బయటపెట్టింది.

 ద ట్రిబ్యూన్ కు చెందిన రిపోర్టర్లు స్వయంగా ఈ అనుభవాన్ని చవి చూశారు. రూ.500 చెల్లించి పది నిమిషాల్లోనే ఎవరి వ్యక్తిగత వివరాలైనా (యూఐడీఏఐకు ఇచ్చినవి) పొందేందుకు వీలుగా ఏజెంట్ వారికి ఓ పోర్టల్ కు సంబంధించి లాగిన్, పాస్ వర్డ్ వివరాలు ఇచ్చాడు. మరో రూ.300 ఇవ్వగా ఆధార్ కార్డులను ప్రింట్ చేసేందుకు ఉద్దేశించిన సాఫ్ట్ వేర్ ను కూడా పంపించడం విశేషం.

ఈ విషయం యూఐడీఏఐ చండీగఢ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా దీనిని జాతీయ భద్రతా ఉల్లంఘనగా పేర్కొన్నారు. యూఐడీఏఐ చండీగఢ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ సంజయ్ జిందాల్ మాట్లాడుతూ... డైరెక్టర్ జనరల్, తనకు తప్ప పంజాబ్ లో మూడో వ్యక్తికి లాగిన్ అయ్యే అవకాశం లేదని పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా ఇలా లాగిన్ అయితే అది చట్టవిరుద్ధమని, భద్రతా ఉల్లంఘనగా పేర్కొన్నారు.

More Telugu News