Parliament of India: పార్లమెంటరీ కమిటీకి ట్రిపుల్ తలాక్ బిల్లు.. రాజ్యసభలో పంతం నెగ్గించుకున్న కాంగ్రెస్!

  • బీజేపీకి రాజ్యసభలో మైనారిటీ
  • ట్రిపుల్ తలాక్ ను వ్యతిరేకిస్తున్న ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు
  • ప్రస్తుత రూపంలో వద్దంటున్న అన్నాడీఎంకే, తెలుగుదేశం
  • పార్లమెంటరీ కమిటీకి వెళ్లనున్న కీలక బిల్లు

లోక్ సభలో తనకున్న ప్రజా ప్రతినిధుల బలంతో ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదింపజేసుకున్న బీజేపీకి రాజ్యసభలో మాత్రం చుక్కెదురైంది. రాజ్యసభలో విపక్షాల బలం ఎక్కువగా ఉండటంతో, వారు కోరినట్టుగానే ఈ బిల్లును పార్లమెంట్ కమిటీకి పంపించాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీంతో పార్లమెంట్ తదుపరి సెషన్ వరకూ ఈ బిల్లును అటకెక్కించినట్టేనని భావించవచ్చు. తదుపరి పార్లమెంట్ సమావేశాలంటే, బడ్జెట్ పై సాగుతాయన్న సంగతి తెలిసిందే.

బడ్జెట్ సమావేశాల్లో ఇటువంటి దీర్ఘకాలిక పెండింగ్ బిల్లులను తెరపైకి తెచ్చే అవకాశాలు లేకపోవడంతో, జూన్ లేదా జూలైలో జరిగే వేసవికాల సమావేశాల వరకూ బిల్లు పార్లమెంటరీ కమిటీ టేబుల్ పైనే ఉండనుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరైనా ముస్లిం వ్యక్తి, తన భార్యకు మూడుసార్లు తలాక్ చెప్పడం ద్వారా విడాకులు ఇస్తే, అతనికి మూడేళ్ల జైలు శిక్ష విధించాలని చట్టంలో ఉన్న నిబంధనను కాంగ్రెస్ తదితర విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక రేపటితో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనుండగా, నేడు ట్రిపుల్ తలాక్ బిల్లును ఎలాగైనా ఆమోదింపజేసుకోవాలని భావిస్తున్న బీజేపీకి, ఎన్డీయే కూటమిలోని ఏఐఏడీఎంకే, బిజూ జనతాదళ్, తెలుగుదేశం వంటి పార్టీల నుంచి కూడా అడ్డంకులు ఎదురైన నేపథ్యంలోనే మోదీ సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ బిల్లుపై ఎలాగైనా చర్చ జరిపి కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని బయట పెట్టాలని బీజేపీ నేతలు భావించినప్పటికీ, ముంబైలో దళితులు, మరాఠాల మధ్య జరుగుతున్న అల్లర్లు సభకు అడ్డంకిగా నిలిచాయి. దీంతో రేపటిలోగా బిల్లు ఆమోదం పొందదన్న ఉద్దేశంతోనే పార్లమెంటరీ కమిటీకి బిల్లును పంపాలని మోదీ భావించినట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News