Kodi Pandelu: అబ్బే అలా చేస్తే మజా ఏముంటుంది?... ప్రశ్నిస్తున్న పందెం రాయుళ్లు!

  • కోడి పందేలపై పరస్పర విరుద్ధ ప్రకటనలు
  • కత్తులు కట్టడం మానబోమంటున్న నిర్వాహకులు
  • భీమవరం ప్రాంతంలో హోటల్సన్నీ బుక్

"ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతికి కోడి పందేలు నిర్వహించుకునేందుకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వబోము. ఎక్కడైనా పందేలు జరిగితే, డీజీపీ, హోం శాఖలదే బాధ్యత"... ఇది తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన రూలింగ్.
"మన సంప్రదాయాలను మనం గౌరవించుకోవాలి. కోడి పందేలు ఆడుకోండి. ఉత్సాహంగా సంక్రాంతిని జరుపుకోండి. కానీ కత్తులు కట్టవద్దు. జూదాలకు దూరంగా ఉండండి"... ఇది ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల చెప్పిన మాట.
"ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందేలు జరుగుతాయి. వాటిని ఎవరూ అడ్డుకోబోరు. తమిళనాడులో జల్లికట్టు సంప్రదాయం మాదిరిగానే ఇక్కడ కోడిపందాలు. నిరభ్యంతరంగా పందేలు నిర్వహించుకోవచ్చు"... ఇది ఏపీ హోం మినిస్టర్ చినరాజప్ప మాట.
"కోడి పందాలు నిర్వహిస్తే చూస్తూ ఊరుకోబోయేది లేదు. ఇప్పటికే వందలాది కోళ్లను స్వాధీనం చేసుకున్నాం. పందెం రాయుళ్లపై బైండోవర్ కేసులు పెట్టాం. ఎక్కడ పందెం బరి ఉన్నా తొలగిస్తున్నాం. గట్టి నిఘా ఏర్పాటు చేశాం"... ఇది ఏపీ పోలీస్ బాస్ చెప్పిన మాట.

ఈ నేపథ్యంలో.. ఇక సంక్రాంతి దగ్గర పడుతున్న వేళ, తాము నిర్వహించే కోడి పందేలను ఎవరూ అడ్డుకోలేరని అంటున్నారు పందెం రాయుళ్లు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, వెంప, ఏలూరు, నరసాపురంతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ, అమలాపురం తదితర ప్రాంతాల్లో పందెం రాయుళ్లు తమ కోళ్లను సిద్ధం చేస్తున్నారు.

కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి పందాలు నిర్వహించడం, ఓడిపోయిన కోడిని అప్పటికప్పుడు కూరొండేయడం ఆనవాయితీయేనని, అలా చేయకుంటే అసలు పందేల్లో మజా ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు పందెం రాయుళ్లు. తమకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అండగా ఉంటారని, పోలీసులు కూడా బందోబస్తుకు మాత్రమే పరిమితమని, అంతకుమించి వారు కూడా ఏమీ చేయలేరని ఘంటాపథంగా చెబుతున్నారు.

కాగా, ఇప్పటికే ఏలూరు, భీమవరం తదితర ప్రాంతాల్లోని హోటల్స్ నన్నింటినీ పందెం రాయుళ్లు బుక్ చేశారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే వైభవంగా కోడి పందేలు నిర్వహిస్తామని వారు చెబుతున్నారు. ఈ పందేలకు తెలంగాణతో పాటు కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో బడాబాబులు హాజరవుతారన్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం కూడా పందేల్లో కోట్ల రూపాయలు చేతులు మారడం ఖాయంగా కనిపిస్తోంది.

More Telugu News