Telangana: రాజ్యాంగ స్ఫూర్తితో నేను చదువుకున్నా.. రిజర్వేషన్ వల్లే ఈ స్థాయికి వచ్చా: కడియం శ్రీహరి

  • విద్యార్థులెవ్వరూ పేదవాళ్లమని బాధపడకూడదు
  • విద్యార్థులకు విద్యాపరంగా అన్ని వసతులు కల్పిస్తున్నాం
  • కేజీబీవి విద్యార్థులకు హెల్త్ కిట్స్ పంపిణీ చేసిన ఉపముఖ్యమంత్రి

అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తితో తాను చదువుకున్నానని, ఆయన కల్పించిన రిజర్వేషన్ వల్లే ఈ స్థాయికి వచ్చానని తెలంగాణ ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఆయన సొంత గ్రామం పర్వతగిరిలోని కస్తూరిబాగాంధీ బాలికా విద్యాలయ (కేజీబీవి) విద్యార్థులకు ఈరోజు హెల్త్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పర్వతగిరిలో అతిపేద కుటుంబంలో తాను పుట్టానని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం స్ఫూర్తితో చదువుకుని, ఆయన కల్పించిన రిజర్వేషన్ల వల్ల ఈరోజు ఈ స్థాయికి వచ్చానని చెప్పారు. విద్యార్థులు ఎవరూ పేదవాళ్లమని బాధపడకూడదని, ఈ ప్రభుత్వం మీకు కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తుందని హామీ ఇచ్చారు.

వారం రోజుల్లో కేజీబీవికి సోలార్ ఫెన్సింగ్, గ్రౌండ్ లెవెలింగ్ చేయించాలని అధికారులను ఆదేశించారు. తన సొంత ఖర్చుతో టీవీని ఏర్పాటు చేయిస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. విద్యార్థులకు విద్యాపరంగా అన్ని వసతులు కల్పించడమే కాకుండా వారి ఆరోగ్య రక్షణ కూడా ఈ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని, అందుకే సన్నబియ్యం, పోషకాహారంతో కూడిన మెను ఇవ్వడంతో పాటు ఆరోగ్య పరిరక్షణకు హెల్త్ కిట్స్ అందిస్తున్నామని చెప్పారు. చలికాలం ఉన్నందున విద్యార్థుల స్నానాలకు వేడినీటి సౌకర్యం కల్పించేందుకు వారం రోజుల్లో హీట్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, ఆర్వో ప్లాంట్ కూడా అమర్చాలని ఈ సందర్భంగా అధికారులను ఆయన ఆదేశించారు.  

  • Loading...

More Telugu News