ghazal srinivas: గ‌జ‌ల్ శ్రీనివాస్ బ‌దులు త‌మిళ గాయ‌కుడి పేరు... ప‌రువు న‌ష్టం దావా వేస్తానన్న శ్రీనివాస్‌!

  • ఇద్ద‌రి పేరు శ్రీనివాస్ కావ‌డంతో తప్పిదం
  • త‌ప్పుగా రాసిన ఇండియాటైమ్స్ వెబ్‌సైట్‌
  • శ్రీనివాస్ అసంతృప్తి వ్య‌క్తం చేయ‌డంతో క్ష‌మాప‌ణ‌లు

త‌న సంస్థ‌లో ప‌నిచేస్తున్న రేడియో జాకీపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన గ‌జ‌ల్ శ్రీనివాస్ ఫొటోకి బ‌దులుగా త‌న ఫొటోను వాడ‌టంపై త‌మిళ గాయ‌కుడు శ్రీనివాస్ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ఆయ‌న సోష‌ల్ మీడియాలో త‌న అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేశారు. త‌న ఫొటోతో ఆర్టిక‌ల్ రాసిన ఇండియా టైమ్స్ వెబ్‌సైట్‌పై ప‌రువు న‌ష్టం దావా వేయ‌నున్న‌ట్లు తెలిపారు.

'కొన్నేళ్ల క్రితం లెజండ‌రీ గాయ‌కుడు పీబీ శ్రీనివాస్ చ‌నిపోయిన‌పుడు, నేను చ‌నిపోయిన‌ట్లు కొంత‌మంది రాశారు. ఇప్పుడు హైద‌రాబాద్‌లో ఎవ‌రో శ్రీనివాస్ అనే గాయ‌కుడు లైంగిక వేధింపుల కేసులో అరెస్టైతే, నా ఫొటోను వేశారు. కానీ ఈసారి నేను ఊరుకోను. వారి మీద ప‌రువు న‌ష్టం దావా వేస్తాను. ఎవ‌రైనా అడ్వ‌కేట్లు నాకు స‌హాయం చేస్తారా?' అంటూ త‌మిళ గాయ‌కుడు శ్రీనివాస్ త‌న ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.

అలాగే త‌న‌కు క్ష‌మాప‌ణ‌లు తెలియ‌జేయాల‌ని కోరుతూ ఇండియా టైమ్స్ కంటెంట్ మేనేజ‌ర్ స‌లోనీ సింగ్‌కి ఆయన ట్వీట్ చేశారు. వెబ్‌సైట్‌లో రాసిన వార్త వల్ల త‌న ప‌రువు దెబ్బ‌తిన్న‌ద‌ని ఆయ‌న పేర్కొన్నారు. దీంతో దీనికి స్పందిస్తూ ఇండియా టైమ్స్ ఆయ‌న‌కు క్ష‌మాప‌ణలు తెలియ‌జేసింది. ఇద్ద‌రి పేరు శ్రీనివాస్ కావ‌డం వ‌ల్ల త‌ప్పిదం జ‌రిగింద‌ని, తాము ఆ ఆర్టిక‌ల్‌ని తొలగించామని ఇండియా టైమ్స్ త‌మ పోస్టులో పేర్కొంది.

  • Loading...

More Telugu News