Vijayawada: పూజల ఫలితం... ఈఓ సూర్యకుమారి బదిలీకి రంగం సిద్ధం!

  • నిన్నటివరకూ తాంత్రిక పూజలు జరగలేదని వాదించిన అధికారులు
  • సీసీటీవీ ఫుటేజ్ రావడంతో విషయం వెలుగులోకి
  • వివాదానికి కేంద్ర బిందువుగా ఈఓ సూర్యకుమారి
  • నేడో రేపో బదిలీ తప్పదంటున్న దేవాదాయ శాఖ అధికారులు

నిన్నటివరకూ కనకదుర్గమ్మ సన్నిధిలో ఏ విధమైన తాంత్రిక పూజలూ జరగలేదని చెబుతూ వచ్చిన ఆలయ పాలకమండలి, ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి రావడంతో విచారణకు ఆదేశించడంతో పాటు చర్యలకు దిగారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, వివాదమంతటికీ కేంద్ర బిందువైన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సూర్యకుమారి బదిలీకి రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఆమెను ట్రాన్స్ ఫర్ చేస్తూ నిర్ణయం వెలువడనుందని, ఆపై కొత్త ఈఓ అధ్యక్షతన ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేయనున్నామని అధికారులు వెల్లడించారు.

ఆలయ సీసీటీవీ ఫుటేజ్ లలో దుర్గమ్మ అంతరాలయం తెరచి వుండటం, లోపలి నుంచి ఓ కొత్త వ్యక్తి బయటకు వచ్చి, కొన్ని బుట్టలను ఓ సెక్యూరిటీ పోలీసుకు అందించడం కనిపిస్తోంది. మంగళవారం 10.29 గంటల సమయాన్ని చూపిస్తున్న వీడియోపై అక్కడి పూజారులు పార్థసారధి అలియాస్ రాజా, ప్రణవ్ తదితరులను విచారించారు. ఆలయంలో భైరవీ పూజ జరిగిన మాట వాస్తవమేనని, అవి ప్రధాన అర్చకుడు బదరీనాథ్ ఆదేశాల మేరకు జరిగాయని వారు వెల్లడించినట్టు తెలుస్తోంది. ఇక అక్కడ కనిపించిన కొత్త వ్యక్తి తమిళనాడుకు చెందిన ప్రముఖ పూజారని అధికారులు గుర్తించారు.

More Telugu News