KCR: తెలంగాణను చూసి బుద్ధి తెచ్చుకోండి... పాలకులకు రాజస్థాన్ పత్రిక చురకలు!

  • 24 గంటల పాటూ విద్యుత్ ను ఉచితంగా అందిస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ
  • 'రాజస్థాన్ పత్రిక' సంపాదకీయం
  • మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా కేసీఆర్ సర్కారు
  • అందరూ అదే దారిలో నడవాలని సూచన

దేశంలో రైతులకు 24 గంటల పాటూ విద్యుత్ ను.. అది కూడా ఉచితంగా అందిస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవడం ఇప్పుడు దేశమంతటినీ ఆకర్షిస్తోంది. తాజాగా ప్రముఖ హిందీ పత్రిక 'రాజస్థాన్ పత్రిక' పాలకులకు చురకలు పెడుతూ, 'తెలంగాణను చూసి గుణపాఠం నేర్చుకోండి' పేరిట ప్రత్యేక సంపాదకీయాన్ని రాసింది. రైతుల పక్షాన నిలవాలని నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలని, కొత్త ఏడాది తొలి రోజున రైతులకు మేలు కలిగేలా కీలక నిర్ణయం తీసుకుందని కితాబిచ్చింది. కష్టకాలంలో ఉన్న రైతాంగం, అతివృష్టి, అనావృష్టితో గోస పెడుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, కేసీఆర్ ప్రభుత్వం వారిని ఆదుకునేందుకు మరే రాష్ట్రమూ తీసుకోని నిర్ణయం తీసుకుందని కొనియాడింది.

స్వతంత్ర భారతావనిలో రైతు సంక్షేమంపై మాటలు చెప్పినవారే తప్ప, ఆచరణలో చూపించిన వారు మాత్రం లేరని గుర్తు చేస్తూ, ఎన్నికలప్పుడు మాత్రమే గుర్తొచ్చే రైతుల కోసం తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలని, అందరు పాలకులూ రైతు సంక్షేమం గురించి ఆలోచించాలని సూచించింది. ఏ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అయినా, తమ తొలి పేరాల్లో రుణమాఫీ, ఉచిత విద్యుత్ వంటి హామీలను ఇస్తుంటాయని, గెలిచిన తరువాత వాటిని మరచిపోవడమే ఇంతకాలమూ చూశామని, ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చిన తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదర్శంగా నిలిచిందని తెలిపింది. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు మేలు చేకూర్చేందుకు అందరూ కలసి ఆలోచించి కృషి చేయాలని చెప్పింది. జరగదని చెప్పుకున్న దాన్ని తెలంగాణ చేసి చూపిందని, ఇక మిగతా రాష్ట్రాల వంతు వచ్చిందని పేర్కొంది.

  • Loading...

More Telugu News