Triple talaq: నేడు రాజ్యసభకు ‘ట్రిపుల్ తలాక్’ బిల్లు.. అడ్డుకున్నా, అంగీకరించినా నష్టపోయేది కాంగ్రెస్సే.. సందిగ్ధావస్థలో అధిష్ఠానం!

  • అడకత్తెరలో పోకచెక్కలా  కాంగ్రెస్ పరిస్థితి
  • అంగీకరిస్తూనే సవరణలు కోరే అవకాశం
  • వ్యూహాలు సిద్ధం చేస్తున్న అధిష్ఠానం
  • బిల్లు పాస్ కావడంపై బీజేపీ ధీమా

బీజేపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘ట్రిపుల్ తలాక్’ బిల్లు నేడు రాజ్య సభకు రానుంది. లోక్‌సభలో మూజువాణి ఓటుతో పాస్ అయిన ఈ బిల్లు రాజ్యసభలో నేడు అడుగుపెట్టనుంది. లోక్‌సభలో తమకు తగిన బలం లేకపోవడంతో బిల్లుపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడం మినహా, ఏమీ చేయలేకపోయిన కాంగ్రెస్ సభ్యులు.. రాజ్యసభలో బలం ఉండడంతో అడ్డుకోవాలని చూస్తుండగా, అధిష్ఠానం మాత్రం సందిగ్ధావస్థలో ఉంది.

అడ్డుకుంటే ముస్లిం మహిళల ఓట్లు దూరమయ్యే అవకాశం ఉండడం, అలాగని అంగీకరిస్తే కనీసం అడ్డుకోవడానికి కూడా ప్రయత్నించలేదన్న అపప్రధ మూటగట్టుకునే ప్రమాదం పొంచి ఉండడంతో ఏం చేయాలో దిక్కు తోచని  స్థితిలో పడిపోయింది. అంటే బిల్లును అంగీకరించినా, అడ్డుకున్నా నష్టపోయేది కాంగ్రెస్సే కాబట్టి, నష్టనివారణ చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.

బిల్లును వ్యతిరేకించకుండానే సవరణలకు పట్టుబట్టడం ద్వారా బిల్లును ఆలస్యం చేయాలని వ్యూహాన్ని రచిస్తోంది. ప్రభుత్వం ఎలాగూ బిల్లును పార్లమెంటరీ కమిటీకి పంపేందుకు ఇష్టపడకపోవడంతో లోపాలు ఎత్తిచూపాలని యోచిస్తోంది.

ముఖ్యంగా తలాక్ చెప్పేవారికి మూడేళ్ల జైలు శిక్షను మార్చాలని, శిక్షను తగ్గించడమో, లేదంటే క్రిమినల్ కేసుగా కాకుండా పరిగణించడమో చేయాలని పట్టుబట్టనుంది. అలాగే తలాక్ చెప్పకుండానే భార్యలను వదిలేస్తే పరిస్థితి ఏంటి? అన్న విషయాన్ని కూడా లేవనెత్తనుంది. ముస్లిం మహిళలపై ఇంత ప్రేమను ఒలకబోస్తున్న ప్రభుత్వం మహిళా రిజ్వేషన్ బిల్లును ఎందుకు తీసుకురావడం లేదన్న విషయాన్ని కూడా అస్త్రంగా చేసుకోవాలని, తమ ప్రభుత్వ హయాంలో ఆ బిల్లును ఎందుకు అడ్డుకున్నారని సభలో నిలదీయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. మొత్తంగా బిల్లును రిఫరెన్స్ కమిటీకి పంపడమే లక్ష్యంగా రాజ్యసభలో పోరాటానికి కాంగ్రెస్ సిద్ధపడుతోంది.

మరోవైపు కాంగ్రెస్‌ను ఇరకాటంలోకి నెట్టిన బీజేపీ ధీమాగా ఉంది. రాజ్యసభలో బిల్లు గట్టెక్కడం ఖాయమని మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ఎన్డీయే బలం 80కి మించి లేదని, టీడీపీ, అన్నాడీఎంకే వంటి పార్టీలు కూడా తమకే మద్దతు ఇస్తాయి కాబట్టి బిల్లు చట్టంగా మారడం పక్కా అని బీజేపీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ వ్యూహం ఏదైనా రాజ్యసభలో మాత్రం ఈ రోజు రక్తికట్టించే సన్నివేశాలు జరుగుతాయని విశ్లేషకులు చెబుతున్నారు.

More Telugu News