parvez musharraf: పాకిస్థాన్ కు మోదీ శాపంగా మారారు.. దేశం నాశనమైపోతోంది: ముషారఫ్

  • అంతర్జాతీయ సమాజాన్ని మోదీ ప్రభావితం చేస్తున్నారు
  • పాక్ ఏకాకిలా మారుతోంది
  • మన దౌత్యనీతికి కాలం చెల్లిపోయింది

పాకిస్థాన్ కు సంబంధించి అంతర్జాతీయ సమాజాన్ని దౌత్యపరంగా భారత ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో ప్రభావితం చేస్తున్నారని పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ అన్నారు. పాకిస్థాన్ ను డామినేట్ చేస్తూ, దేశం పట్ల శాపంగా పరిణమించారని కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ కారణంగా అంతర్జాతీయ సమాజంలో పాక్ ఏకాకిలా మారుతోందని అన్నారు. ఓ ప్రముఖ పాకిస్థానీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు స్పందించారు.

అంతర్జాతీయంగా పాకిస్థాన్ కు ఏమాత్రమైనా గౌరవం ఉందా? అంటూ ముషారఫ్ సూటిగా ప్రశ్నించారు. పాకిస్థాన్ దౌత్యనీతికి కాలం చెల్లిపోయిందని అన్నారు. అష్కరే తాయిబా ఉగ్ర సంస్థ అనే విషయాన్ని మనం చెప్పడం తప్పని అన్నారు. కుల్ భూషన్ జాదవ్ గూఢచారి కాదని ఇండియా వాదిస్తోందని... అలాంటప్పుడు లష్కరే తాయిబా ఉగ్ర సంస్థ అని మనమెందుకు చెప్పాలని ప్రశ్నించారు. తన హయాంలో పాకిస్థాన్ దౌత్యనీతి దూకుడుగా ఉండేదని చెప్పారు.

లష్కరే తాయిబా, జమాద్ ఉద్దవాలు దేశ భక్తి గల సంస్థలని ఇటీవల ముషారఫ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సంస్థల కార్యకర్తలు దేశం కోసం తమ ప్రాణాలను కూడా అర్పించారని ఆయన అన్నారు. ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ కు కూడా ఆయన మద్దతు పలికారు.

More Telugu News