Vijayawada: కనకదుర్గమ్మ సన్నిధిలో అర్థరాత్రి కనిపించిన ఈ అపరిచితుడు ఎవరు?

  • డిసెంబర్ 26న అర్థరాత్రి పూజలు
  • సీసీటీవీలో సీనియర్ అర్చకుడితో పాటు అపరిచితుడు 
  • తాంత్రిక పూజలు చేసినట్టు అనుమానాలు
  • నిజం తేలుస్తామన్న ఈఓ

డిసెంబర్ 26న బెజవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో అర్థరాత్రి పూజలు నిర్వహించినట్టు వచ్చిన ఆరోపణలపై విచారణ జరుపుతున్న పోలీసులు కీలకాంశాలను వెలుగులోకి తెచ్చారు. నాటి సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించగా, ఆలయ అర్చకుల్లో లేని ఓ వ్యక్తి దుర్గమ్మ సన్నిధిలో ఉన్నట్టు తేలింది. ఇప్పుడావ్యక్తి ఎవరన్న విషయమై తేల్చేందుకు సిద్ధమైన విచారణ అధికారులు, ఆయన ఫోటోను విడుదల చేశారు.

సాధారణంగా దుర్గమ్మ ఆలయం రాత్రి 9 గంటలకే మూసేస్తారు. ఆ తరువాత తిరిగి ఉదయం వరకూ అంతరాలయాన్ని తెరవరు. కానీ, 26న రాత్రి 11 గంటల తరువాత ఆలయంలో పూజలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. తాంత్రికులను రప్పించి ప్రత్యేక పూజలు జరిపారన్న కోణంలోనూ ఇప్పుడు విచారణ జరుగుతోంది. ఆయనతో పాటు ఓ సీనియర్ అర్చకుడు, మరో జూనియర్ అర్చకుడు కూడా సీసీటీవీ ఫుటేజ్ లో కనిపిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక ఆరోజు అర్థరాత్రి 12.45 గంటల వరకూ ఆలయం తెరిచే వుంచారన్నది సమాచారం. ఆలయాన్ని శుభ్రం చేసేందుకు ఇద్దరికి అనుమతి ఇచ్చామని అధికారులు అంటుంటే, వారి అనుమతితోనే ఎవరో పెద్దమనిషికి ప్రత్యేక పూజలకు అనుమతిచ్చారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ట్రస్ట్ బోర్డు సమావేశంలో తీవ్రమైన చర్చ జరుగగా, నిజాన్ని నిగ్గు తేలుస్తామని ఈవో వ్యాఖ్యానించారు.

More Telugu News