Delhi: పొగమంచు కౌగిలిలో ఢిల్లీ.. విమాన ప్రయాణాలకు ఆటంకం.. పలు విమానాలు, రైళ్లు రద్దు!

  • ఈ సీజన్‌లో ఎన్నడూ లేనంతగా కమ్మేసిన పొగమంచు
  • కన్ను చించుకున్నా కానరాని దారి
  • కొన్ని విమానాల రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు
  • దారి కనిపించకపోవడంతో పలు రైళ్లను రద్దు చేసిన అధికారులు

దేశ రాజధాని ఢిల్లీ పొగమంచు కౌగిలిలో చిక్కుకుంది. ఈ సీజన్‌లోనే ఎన్నడూ లేనంతగా మంచు కురవడంతో విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమానాలు నిలిచిపోయాయి. మొత్తంగా 220 విమానాలపై మంచు ప్రభావం పడింది. 150 విమానాలు ఆలస్యంగా నడవగా మరో 50 విమానాలను దారి మళ్లించారు.

రన్‌వేపై ఈ తెల్లవారుజామున 6 గంటలకు విజిబులిటీ 200 మీటర్లకు పడిపోయిందని, ఏడు గంటలకు అది 50 మీటర్లకు తగ్గినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ కారణంగా మరో 20 విమానాలను రద్దు చేశారు. విజిబులిటీ 25-50 మీటర్లలోపు ఉంటేనే విమానాలను ల్యాండ్ చేయడానికి పైలట్లకు అనుమతి ఇస్తారు.

విమానాలు ఆలస్యం కావడంతో విమానాశ్రయంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విమానం కోసం దాదాపు 6 గంటలపాటు వేచి చూడాల్సి వచ్చింది. దీంతో ప్రయాణికులతో విమానాశ్రయం రద్దీగా మారింది. మరోవైపు రైలు ప్రయాణాలపైనా పొగమంచు ప్రభావం పడింది. 90 రైళ్లు ఆలస్యంగా నడవగా, 15 రైళ్లను రద్దు చేశారు.

More Telugu News