Nitin Patel: గుజరాత్ డిప్యూటీ సీఎంకు హార్ధిక్ పటేల్ బంపరాఫర్.. బీజేపీని వీడితే కాంగ్రెస్‌లో మంచి పదవి ఇప్పిస్తానని హామీ!

  • పట్టుమని పదిరోజులైనా  కాకముందే గుజరాత్ ప్రభుత్వంలో లుకలుకలు
  • శాఖల  కేటాయింపుపై ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ అసంతృప్తి 
  • ఇప్పటి వరకు శాఖలు చేపట్టని వైనం
  • నితిన్‌కు మద్దతు ప్రకటించిన ఎస్‌పీజీ

గుజరాత్‌లోని అధికార బీజేపీలో లుకలుకలు మొదలైన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్‌కు పటీదార్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. గుర్తింపు లేదని బాధపడుతున్న ఆయన బీజేపీని వీడి వస్తే కాంగ్రెస్ అధిష్ఠానంతో మాట్లాడి మంచి పదవి ఇప్పిస్తానని ఆఫర్ ఇచ్చారు. తనకు ప్రాధాన్యం లేని శాఖలు కేటాయించడంపై నితిన్ పటేల్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో హార్థిక్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

నితిన్ పటేల్‌ బీజేపీని వీడి రావాలని కోరారు. నితిన్ రాజీనామాకు సిద్ధపడితే మరో పదిమంది ఎమ్మెల్యేలు కూడా ఆయనతోపాటు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు రెండున్నర దశాబ్దాలు కష్టపడిన వ్యక్తికి గౌరవం ఇవ్వకుండా పక్కనపెట్టేశారని, ఈ విషయాన్ని పటేల్  సామాజిక వర్గం గుర్తించాలని కోరారు.

గుజరాత్‌లో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో నితిన్‌కు మద్దతు ఇస్తామంటూ సర్దార్ పటేల్ గ్రూప్ (ఎస్‌పీజీ) ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి రూపానీని తొలగించి నితిన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని ఎస్‌పీజీ చీఫ్ లాల్‌జీ పటేల్ డిమాండ్ చేశారు. మద్దతుదారులతో కలిసి శనివారం అహ్మదాబాద్‌లో నితిన్‌ను కలిసిన ఆయన పూర్తి మద్దతు ప్రకటించారు. ఆయనకు సంఘీభావంగా జనవరి ఒకటిన నితిన్ పటేల్ నియోజకవర్గమైన మెహసాన్‌లో బంద్‌కు పిలుపునిచ్చారు.

నితిన్ పటేల్ గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక, పట్టణాభివృద్ధి శాఖలు నిర్వర్తించారు. ఇప్పుడు ఆయనకు రోడ్లు, భవనాలు, ఆరోగ్య శాఖలతోపాటు నర్మదా, కల్పసర్ ప్రాజెక్టుల బాధ్యతలను అప్పజెప్పారు. దీంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన బాధ్యతలు స్వీకరించలేదు.  

More Telugu News