Venu Swami: పవన్ కల్యాణ్ పై జ్యోతిష్కుడు వేణు స్వామి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు... టీవీ9 డిస్కషన్ లో సమాధానం చెప్పలేక పారిపోయిన వైనం!

  • పవన్ సీఎం అయ్యే అవకాశం లేదన్న వేణుస్వామి
  • డిస్కషన్ లోకి వచ్చిన జనవిజ్ఞానవేదిక
  • నటుడు వేణుమాధవ్, జనసేన కార్యకర్త కిరణ్
  • చర్చను మధ్యలో వదిలేసి వెళ్లిపోయిన వేణు స్వామి

పవన్ కల్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం అయ్యే అవకాశాలు లేవని, అందుకాయన జాతకం సహకరించదని, తెలుగు టీవీ చానల్ టీవీ 9 వేదికగా జ్యోతిష్కుడు వేణు స్వామిసంచలన వ్యాఖ్యలు చేసిన వేళ, అదే డిస్కషన్ లో పాల్గొన్న వారు వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆయన మధ్యలోనే వెళ్లిపోయారు.

పవన్ కు రాజభోగమే తప్ప రాజయోగం లేదని వేణు స్వామి చెప్పగా, జనసేన కార్యకర్త కిరణ్ తీవ్రంగా విభేదించారు. ఇక ఆ సమయంలోనే డిస్కషన్ కు వచ్చిన జనవిజ్ఞానవేదిక సభ్యులు పీవీ రావు ఎంటర్ అయ్యారు. ఆయన వేణు స్వామి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ఆయన మాటల గారడీలు చేస్తున్నారని, ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు.

గతంలో ఆయన ఆగస్టు 2017 తరువాత తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్లు వస్తారని, నరసింహన్ వెళ్లిపోతారని జోస్యం చెప్పారని, అది జరగలేదని గుర్తు చేశారు. 'బిగ్ బాస్' షోలో విజేతగా నవదీప్ గెలుస్తాడని, శివబాలాజీకి జాతకం అనుకూలంగా లేదని చెప్పారని అన్నారు. వేణు స్వామి నంబర్ వన్ మోసగాడని చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యం అవసరం లేదని అన్నారు.

ఈ సమయంలో వేణు కల్పించుకుని, తనను పవన్ కల్యాణ్ పై మాట్లాడాలని టీవీ9 పిలిపించిందని, డిస్కషన్ ను మారుస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలకు ఏడాదిన్నర ముందే పవన్ కల్యాణ్ గురించి ఎలా చెబుతారని, గతంలో వెంకయ్యనాయుడు సీఎం అవుతారని తప్పుడు జోస్యం చెప్పారని పీవీ రావు విరుచుకుపడ్డారు.

ఈ సమయంలో సినీ నటుడు వేణుమాధవ్ కూడా చర్చలోకి ఎంటర్ అయ్యాడు. తన డేటాఫ్ బర్త్ చెప్పి, తాను ఎమ్మెల్యేగా గెలుస్తానా? అని ప్రశ్నించాడు. దీనికి వేణు సమాధానం ఇస్తూ, ఈ జాతకుడిని 2012 నుంచి అనారోగ్యం పీడిస్తోందని, లివర్ సమస్యలు వస్తాయని, సినిమా అవకాశాలు తగ్గుతాయని అన్నారు. 2020 వరకూ ఎమ్మెల్యే చాన్స్ లేదన్నారు.

దీనిపై వేణు మాధవ్ మాట్లాడుతూ, "నాయనా బంగారుతండ్రీ... నీకు దమ్ముంటే వచ్చి నా దగ్గర నీవు డీఎన్ఏ టెస్టులు తీసుకో... నాకేమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అని. సెకండ్ థింగ్... నీవల్లేమీ కాదు. నువ్వేమీ చెప్పలేవు. నువ్వు మీసాలకు రంగేసుకుని మిగలాల్సిందే మా అయ్యగా... కలరింగ్ ఎక్కువ. ఆయన చెప్పిన ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధం. సెకనుకు ఓ మాట మారుస్తే ఎలాగయ్యా?" అని నిప్పులు చెరిగారు.

 ఇక తనను కావాలని చానల్ కు పిలిపించి అవమానిస్తున్నారని ఆరోపిస్తూ, వేణు స్వామి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తనను పవన్ కల్యాణ్ పై మాట్లాడాలని పిలిచారని గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

More Telugu News