India: హఫీజ్ సయీద్ పక్కన పాలస్తీనా ఉన్నతాధికారి... పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న భారత్!

  • దేశాన్ని ఏలాలని కలలుగంటున్న సయీద్
  • ఓ బహిరంగ సభకు సయీద్ తో పాటు పాలస్తీనా రాయబారి
  • మండిపడిన భారత విదేశాంగ శాఖ
  • ఇండియన్ అంబాసిడర్ తో చర్చించాలని నిర్ణయం

ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి, ఉగ్రనేత హఫీజ్ సయీద్ పక్కన పాలస్తీనాకు చెందిన దౌత్యాధికారి ఉన్న ఫోటోలు విడుదల కాగా, భారత్ సదరు అధికారి చర్యలను తీవ్రంగా ఖండించింది. పాకిస్థాన్ లో పాలస్తీనా అంబాసడర్ గా ఉన్న వాలిద్ అబూ అలీ, శుక్రవారం ప్రార్థనల సందర్భంగా లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు, ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చి దేశాన్ని ఏలాలని కలలుగంటున్న సయీద్ వెంట ఓ బహిరంగ సభకు హాజరయ్యాడు. సయీద్ ఓ ర్యాలీకి పిలుపునివ్వగా, ఆయన దీనికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా భారత్ ను లక్ష్యంగా చేసుకుని సయీద్ కటువు వ్యాఖ్యలు చేశాడు. కాశ్మీర్ ను విముక్తం చేయడమే తన లక్ష్యమన్నాడు. జరూసలేం ఇజ్రాయిల్ రాజధానని అమెరికా చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా ముస్లిం దేశాల మద్దతును కూడగట్టేందుకు ఓ ఇస్లామిక్ సదస్సును నిర్వహించాలని డిమాండ్ చేసి పాక్ ప్రధాని షాహిద్ అబ్బాసీపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశాడు.

ఇక ఇదే సమావేశంలో పాలస్తీనా అధికారి పాల్గొనడంపై భారత్ స్పందించింది. ఐరాస గ్లోబల్ టెర్రరిస్టుగా అభివర్ణించిన వ్యక్తి వెంట, పాలస్తీనా అధికారి ఉండటమేంటని విదేశాంగ శాఖ ప్రతినిధి రావీష్ కుమార్ ప్రశ్నించారు. ఇండియాలోని పాలస్తీనా అంబాసిడర్ తో ఈ విషయాన్ని చర్చించాలని నిర్ణయించామని అన్నారు. పాలస్తీనా, ఇండియా మధ్య మంచి స్నేహబంధముందని, ఈ తరహా చర్యలు వాటిని దెబ్బతీస్తాయని తెలిపారు.

More Telugu News