bitcoin: బిట్ కాయిన్ల జోలికి పోవద్దు... కేంద్ర ఆర్థిక శాఖ హెచ్చరిక

  • పొంజి స్కీమ్ ల తరహాలోనే నష్టపోవాల్సి వస్తుంది
  • బిట్ కాయిన్లకు రక్షణ కరువే
  • వీటికి ఎటువంటి విలువ ఉండదన్న ఆర్థిక శాఖ

బిట్ కాయిన్లలో ట్రేడింగ్ చేసే వారిని కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా హెచ్చరించింది. బిట్ కాయిన్లను పొంజి స్కీమ్ (మోసపూరిత పథకాలు)లతో పోల్చింది. ‘‘బిట్ కాయిన్ సహా పలు వర్చువల్ కరెన్సీల ధరలు ఇటీవలి కాలంలో అనూహ్యంగా పెరిగిపోయాయి. వర్చువల్ కరెన్సీలకు అంతర్గతంగా ఎటువంటి విలువ ఉండదు. పూర్తిగా స్పెక్యులేషన్ ఆధారంగా నడిచే దీని ధరల్లో అస్థిరతలు ఉంటాయి’’ అని ఆర్థిక శాఖ తన ప్రకటనలో వివరించింది.

బిట్ కాయిన్లలో ట్రేడింగ్, ఇన్వెస్టింగ్ కు దూరంగా ఉండాలని గతంలోనూ కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్ బీఐ పిలుపునిచ్చాయి. పొంజి స్కీమ్ లను తలపిస్తున్న వర్చువల్ కరెన్సీల్లో ఒక్కసారిగా పతనం చోటు చేసుకుంటే ఇన్వెస్టర్లు తమ కష్టార్జితమంతా కోల్పోవాల్సి వస్తుందని ఆర్థిక శాఖ హితవు పలికింది. వర్చువల్ కరెన్సీలు డిజిటల్ రూపంలో ఆన్ లైన్ లో ఉంటాయి కనుక, మాల్వేర్, ర్యాన్సమ్ వేర్ దాడుల ప్రమాదం ఉంటుందని సూచించింది. బిట్ కాయిన్ లో ఇన్వెస్టర్ల గుర్తింపు గోప్యంగా ఉండడం వల్ల ఇది ఉగ్రవాదులకు నిధులు, స్మగ్లింగ్ తదితర చట్టవిరుద్ధమైన చర్యలకు ప్రోత్సాహాన్నిస్తుందని కూడా పేర్కొంది.

More Telugu News