Chandrababu: పది రోజుల ‘జన్మభూమి’ సాగేది ఇలా!

  • వచ్చే నెల 2 నుంచి పదిరోజుల పాటు ‘జన్మభూమి’
  • పది జిల్లాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొననున్న ఏపీ సీఎం
  • మీడియాతో మాట్లాడిన చంద్రబాబు

ప్రభుత్వంలో ప్రజలను భాగస్వాములు చేసి రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. సచివాలయంలోని ఒకటో బ్లాక్ లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వచ్చే నెల 2 వ తేదీ నుంచి ఐదో విడత ‘జన్మభూమి’ కార్యక్రమం ప్రారంభం కానున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా పది రోజుల పాటు పది జిల్లాల్లో తాను పర్యటించనున్నట్లు చెప్పారు. ‘జన్మభూమి’లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో కలిసి లక్షా 80 వేల సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్ర విభజన కారణంగా నవ్యాంధ్ర ప్రదేశ్ ప్రయాణం ఎన్నో ఒడిదుడుకులతో ప్రారంభమైందని, ఇటువంటి సమయంలో రాష్ట్రాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరం ఉందని అన్నారు.  

‘జన్మభూమి’లో అగ్రికల్చర్, మెడిసిన్ విద్యార్థుల సేవలు

‘జన్మభూమి’ కార్యక్రమంలో విద్యార్థులను భాగస్వాములు చేస్తున్నామని, అగ్రికల్చర్, మెడిసిన్ విద్యార్థుల సేవలను వినియోగించుకుంటామని చంద్రబాబు వెల్లడించారు. జన్మభూమి సందర్భంగా చేపట్టే రోజువారీ కార్యక్రమాల్లో అంశాల వారీగా విద్యార్థుల సేవలను వినియోగించుకుంటామని, తద్వారా విద్యార్థులకు క్షేత్రస్థాయిలో ఎదురయ్యే అంశాలపై అవగాహన కలుగుతుందని అన్నారు.  

పంచాయతీలకు స్టార్ రేటింగ్స్


అభివృద్ధి ఆధారంగా పంచాయతీలకు స్టార్ రేటింగ్స్ ఇవ్వనున్నట్లు చంద్రబాబునాయుడు తెలిపారు. పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, మౌలిక సదుపాయాల కల్పన ఆధారంగా ఈ రేటింగ్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా, పౌష్టికాహారం కల్పనకూ రేటింగ్ ఇవ్వనున్నట్టు తెలిపారు. 10 స్టార్ రేటింగ్స్ వచ్చిన పంచాయతీలను ఉత్తమ పంచాయతీలుగా గుర్తించి, ప్రోత్సాహకాలు అందజేస్తామని అన్నారు.

పది రోజుల ‘జన్మభూమి’ సాగేది ఇలా..


* మొదటి రోజు - సంక్షేమం, సంతృప్తి
* రెండో రోజు - ఆరోగ్యం, ఆనందం
* మూడో రోజు - స్వచ్ఛాంధ్రప్రదేశ్
* నాలుగో రోజు - విద్య, వికాసం
* అయిదో రోజు - గ్రామీణ మౌలిక సదుపాయల కల్పన
* ఆరవ రోజు - సహజ వనరుల అభివృద్ధి
* ఏడో రోజు - వ్యవసాయం అనుబంధం
* ఎనిమిదో రోజు - సుపరిపాలన, టెక్నాలజీ
* తొమ్మిదో రోజు - స్వర్ణాంధ్రప్రదేశ్, పేదరికంపై గెలుపు
* పదో రోజు - ఆనందలహరి

More Telugu News