drivers: 'పార్టీలున్నాయా.. భయపడకండి' అంటున్న డ్రైవ‌ర్ల యాప్‌!

  • యాప్ పేరు 'హాప్‌'
  • న్యూఇయ‌ర్ రోజు తాగి డ్రైవ్ చేయ‌లేని వారికోసం ప్ర‌త్యేకం
  • ఇప్ప‌టికే 100కి పైగా అడ్వాన్స్ బుకింగ్‌లు

కొత్త‌సంవ‌త్స‌రం వేడుక‌లు జ‌రిగే డిసెంబ‌ర్ 31 రాత్రి పూట న‌గ‌ర‌వ్యాప్తంగా డ్రంకెన్ డ్రైవ్‌లు చేప‌ట్టేందుకు పోలీసు శాఖ యోచిస్తోంది. ఈ కార‌ణంగా పార్టీల‌ను ర‌ద్దు చేసుకోవ‌లసిన అవసరం లేదని చెబుతోంది ఓ కొత్త యాప్. పార్టీల్లో విప‌రీతంగా తాగి, పోలీసుల‌ నుంచి త‌ప్పించుకోవ‌డానికి అబ‌ద్ధాలు చెప్ప‌డం, తాగి డ్రైవ్ చేసి అమాయ‌కుల ప్రాణాల‌ను బ‌లిగొన‌డం లాంటివి జ‌ర‌గ‌కుండా చేసే ఓ యాప్ ఉంది. దాని పేరు `హాప్‌`. ఇందులో డ్రైవ‌ర్లు అద్దెకు దొరుకుతారు.

గంట‌ల లెక్క‌న ఈ యాప్ ద్వారా సుశిక్షితులైన‌, లైసెన్స్ ఉన్న డ్రైవ‌ర్ల‌ను ఎంచుకోవ‌చ్చు. యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని, పిక‌ప్ చేసుకోవాల్సిన లొకేష‌న్‌ని ఎంచుకుంటే స‌రిపోతుంది. డ్రైవ‌ర్ వ‌చ్చి, కారు తాళాలు తీసుకుని, కారు న‌డిపి, ఇంటి ద‌గ్గ‌ర దిగ‌బెట్టి, మ‌ళ్లీ కారు తాళాల‌ను చేతుల్లో పెట్టి వెళ్తాడు. ఈ యాప్‌ను హైద్రాబాద్‌కి చెందిన శివ‌రాజ్ రాజేశ్వ‌ర‌న్ త‌యారుచేశాడు.

తాను ఒక‌సారి తాగి డ్రైవ్ చేయ‌లేని స్థితిలో ఉన్న‌పుడు ఇంట్లో దింప‌డానికి ఎవ‌రూ ముందుకురాన‌పుడు త‌న‌కు ఈ ఆలోచ‌న వ‌చ్చింద‌ని శివ‌రాజ్ తెలిపాడు. అంతేకాకుండా తాగి డ్రైవ్ చేసి ప‌సిపాప ప్రాణాల‌ను బ‌లిగొన్న యాక్సిడెంట్ గురించి తెలిశాక యాప్ త‌యారుచేసే ప‌నుల‌ను ముమ్మ‌రం చేశాడు. మొత్తానికి అనుకున్న‌ట్లుగానే యాప్ త‌యారుచేసి గ‌త మే నెల‌లో విడుద‌ల చేశాడు. ఇప్ప‌టికే ఈ యాప్‌ను హైద్రాబాద్ వ్యాప్తంగా చాలా మంది వినియోగిస్తున్నారు. న్యూఇయ‌ర్ సంద‌ర్భంగా త‌మ‌కు డ్రైవ‌ర్ కావాలంటూ ఇప్ప‌టికే 100కి పైగా అడ్వాన్స్ బుకింగ్‌లు వ‌చ్చాయ‌ని శివ‌రాజ్ వెల్ల‌డించారు.

More Telugu News