asaduddin owaisi: మోదీ భార్య గురించి పరోక్ష వ్యాఖ్యలు చేసిన ఒవైసీ!

  • భర్తలు వదిలేసిన 20 లక్షల మంది మహిళల సంగతేంటి?
  • వీరిలో గుజరాత్ లోని మా వదిన కూడా ఉన్నారు
  • ముస్లింలను సంప్రదించకుండానే బిల్లు

లోక్ సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుకు నిన్న ఆమోదం లభించింది. అంతకు ముందు ఈ బిల్లును ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సభలోనూ, బయటా తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లును రూపొందించే సమయంలో కేంద్ర ప్రభుత్వం ముస్లింలను సంప్రదించలేదని ఆయన మండిపడ్డారు. కేవలం ముస్లిం మహిళల గురించే మాట్లాడుతున్నారని... దేశ వ్యాప్తంగా భర్తలు వదిలేసిన 20 లక్షల మంది భార్యల సంగతి ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ బాధితురాళ్లలో గుజరాత్ లో ఉన్న తన వదిన కూడా ఉన్నారంటూ ప్రధాని మోదీ భార్య గురించి పరోక్షంగా వ్యాఖ్యానించారు.

మరోవైపు, ఈ బిల్లుకు సంబంధించి ఒవైసీ మూడు సవరణలను ప్రతిపాదించగా... వాటిపై ఓటింగ్ జరిగింది. ఓటింగ్ లో ఒవైసీకి అనుకూలంగా కేవలం రెండు ఓట్లు మాత్రమే రాగా, వ్యతిరేకంగా 241 ఓట్లు పడ్డాయి. సభకు హాజరైనవారిలో నలుగురు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. సీపీఎం ఎంపీ సంపత్, కాంగ్రెస్ ఎంపీ సుస్మితా దేవ్ లు కూడా కొన్ని సవరణలను ప్రతిపాదించగా... సభ వాటిని తిరస్కరించింది. వెంటనే, తలాక్ బిల్లును సభ ఆమోదించినట్టు స్పీకర్ ప్రకటించారు. ఈ బిల్లుకు రాజ్యసభ కూడా ఆమోదం తెలిపితే, అది చట్ట రూపం దాల్చుతుంది.

  • Loading...

More Telugu News