Ajay Garg: క్షణాల్లో రైల్వే తత్కాల్ టికెట్లు మాయమవడానికి కారణం ఇదే... ఇంతకాలానికి కనిపెట్టిన సీబీఐ!

  • దళారుల కోసం ప్రత్యేక సాఫ్ట్ వేర్
  • తయారు చేసిచ్చిన సీబీఐ అసిస్టెంట్ ప్రోగ్రామర్
  • ఐఆర్సీటీసీలో లోపాలే వరం
  • ఒక్క క్లిక్కుతో వందల సంఖ్యలో టికెట్లు
  • కోట్లు సంపాదించిన అజయ్ గార్గ్

తెల్లవార్లూ రైల్వే కౌంటర్ల ముందు నిలబడినా, రైల్వే తత్కాల్ టికెట్ దొరకదు. వందల సంఖ్యలో బెర్తులున్నా క్షణాల్లోనే అయిపోతాయి. ఇంటర్నెట్ ద్వారా ప్రయత్నించినా, అదే కనిపిస్తుంది. అదే ఎక్కువ ధర పెట్టి, ఓ దళారీని ఆశ్రయిస్తే, టికెట్ దొరికిపోతుంది. దీనికి కారణమేంటో ఇన్నాళ్లకు బయటపడింది. సాక్షాత్తూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆఫీసులో అసిస్టెంట్ ప్రోగ్రామర్ గా ఉన్న అజయ్ గార్గ్, రైల్వే కంప్యూటర్ వ్యవస్థలోకి దళారులు చొరబడేందుకు వీలును కలిగించేలా ఓ ప్రోగ్రామ్ ను తయారు చేసి వారికి విక్రయించాడు. ఈ వ్యవహారం బుధవారం వెలుగులోకి వచ్చి ప్రకంపనలు సృష్టించింది.

2007 నుంచి 2011 వరకూ ఐఆర్సీటీసీలో పని చేసిన అనుభవం, సాఫ్ట్ వేర్ నిపుణుడు కావడంతో, వ్యవస్థా లోపాలపై అవగాహన పెంచుకుని, ఒక్క క్లిక్కుతో వందల టికెట్లు సంపాదించేలా సాఫ్ట్ వేర్ సృష్టించాడు. అతనికి అనిల్ గుప్తా అనే మరో యువకుడు సహకరించాడని సీబీఐ అధికారులు తెలిపారు. ఇక, వీరు తమ సాఫ్ట్ వేర్ ను దళారులకు విక్రయించి కోట్ల ఆస్తులు కూడగట్టడం గమనార్హం. గార్గ్ కు అతని తల్లిదండ్రులతో పాటు భార్య, చెల్లెలు, బావమరిది కూడా తమవంతు సహకారాన్ని అందించారు. ఎవరికీ దొరక్కుండా ఉండేందుకు హవాలా మార్గాలు, బిట్ కాయిన్ కొనుగోళ్ల ద్వారా లావాదేవీలు జరిపారు. ఢిల్లీ, ముంబైసహా 14 ప్రాంతాల్లో ఆస్తులను సంపాదించారు.

ఈ సాఫ్ట్ వేర్ ను వాడుకోవాలంటే లాగిన్, ఐడీ, పాస్ వర్డ్ అవసరం. దళారుల నుంచి మళ్లీ మళ్లీ డబ్బులు దండుకోవడం కోసం పాస్ వర్డ్ ను గార్గ్ తరచూ మార్చేవాడు. దీంతో దళారులు కూడా అతనికి భారీగానే డబ్బు ముట్టజెప్పేవారు. సాధారణంగా ఒక టికెట్ పీఎన్ఆర్ పొందాలంటే, కనీసం రెండు నిమిషాలు సమయం తీసుకుంటుందన్న సంగతి తెలిసిందే. ఈ సాఫ్ట్ వేర్ సాయంతో తత్కాల్ టికెట్ల జారీ మొదలు కాగానే, సెకన్లలో భారీగా టికెట్లను పొందవచ్చు. ఇక అజయ్ గార్గ్ తో డీల్స్ జరిపిన 10 మంది ఏజంట్లను ఇప్పటివరకూ గుర్తించామని సీబీఐ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటివరకూ ఇద్దరిని అరెస్ట్ చేసి విచారణ నిమిత్తం కస్టడీకి తీసుకున్నామని సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ పేర్కొన్నారు.

More Telugu News