Pakistan: ఉగ్రవాద దేశం పాకిస్తాన్ భారత స్త్రీని ఘోరంగా అవమానించింది: తూర్పారబెట్టిన స్వామి పరిపూర్ణానంద

  • ‘అతిథి దేవో భవ’ అనే సూక్తి ఇటువంటి వారికి వంటబడుతుందా?
  • ఉగ్రవాద దేశం పాకిస్తాన్ భారత స్త్రీని ఘోరంగా అవమానించింది
  • కులభూషణ్ జాదవ్ తల్లి, భార్యను అవమానించడంపై మండిపడ్డ పరిపూర్ణానంద

మరణశిక్షకు గురై ప్రస్తుతం పాకిస్థాన్ జైలులో ఉన్న భారత నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ ను ఆయన తల్లి అవంతి జాదవ్, భార్య నేతన్ కుల్ జాదవ్ నిన్న కలిసిన విషయం తెలిసిందే. అయితే, తన కుమారుడిని నేరుగా కలవకుండా గాజు తెర అడ్డంగా పెట్టడం, ‘హంతకుడి తల్లి’ అంటూ ఆమెపై పాక్ మీడియా నోరుపారేసుకోవడం విదితమే.

ఈ విషయమై స్వామి పరిపూర్ణానంద ఘాటుగా స్పందించారు. పాకిస్తాన్ దుర్నీతి, దుష్టపాలన, దుర్వ్యవస్థ ఎంత నీచమో ఈ తల్లికి జరిగిన అవమానమే నిదర్శనమంటూ మండిపడ్డారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఓ పోస్ట్ చేశారు. పాకిస్తాన్ దేశాన్ని తూర్పారబట్టిన ఆ పోస్ట్ లో పరిపూర్ణానంద ఏమన్నారంటే..

‘పాకిస్తాన్ దుర్నీతి, దుష్ట పాలన, దుర వ్యవస్థ ఎంత నీచమో ఈ తల్లికి జరిగిన అవమానం చాలు…అయినా ‘అతిథి దేవో భవ’ అన్న సూక్తి ఇటువంటి వారికి వంటబడుతుందా,.. మతం పేరుతో మారణకాండను సృష్టించడం మినహాయించి.. ఉగ్రవాద దేశం పాకిస్తాన్ భారత స్త్రీని ఘోరంగా అవమానించింది. భారతీయ స్త్రీ పట్ల అమర్యాదగా ప్రవర్తించింది. భారతీయ స్త్రీ ఎంతో పవిత్రంగా భావించే బొట్టు, మంగళ సూత్రం, గాజులను భర్త ముందే తీయించి మన సంస్కృతి, సంప్రదాయాలను అపహాస్యం చేసింది.

గూఢచర్య అరోపణలపై అరెస్ట్‌ అయ్యి మరణశిక్ష పడ్డ భారత నౌకాదళ అధికారి కుల్‌ భూషణ్‌ జాదవ్‌ ను చూడడానికి ఆయన భార్య, తల్లి ఈ నెల 25న పాకిస్తాన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో పాక్ అధికారులు వారితో అమానవీయంగా ప్రవర్తించారు.

జాదవ్ భార్య చేతన్‌ కుల్‌, తల్లి అవంతిలను ఇస్లామాబాద్‌లో ఓ పాత షిప్పింగ్‌ కంటైనర్‌ వెనుక భాగానికి తీసుకెళ్ళారు. అక్కడ ఓ గాజుగోడ అడ్డుగా ఉన్న చిన్న గదిలో ఓ వైపు వీరిరువురినీ, ఆవలవైపు కుల్‌ భూషణ్‌ ని కూర్చోబెట్టి మాట్లాడుకోమన్నారు. దీనికి ముందు భార్య చేతనను కుంకుమ బొట్టు చెరిపేయమన్నారు. మంగళసూత్రాన్ని, గాజులను తీసేయమన్నారు. వారిద్దర్నీ కట్టుకున్న బట్టలు మార్చేసి వేరేవి కట్టుకోమన్నారు.

తల్లి అవంతిని కూడా బొట్టు తీసేయమన్నారు. ఆమె కొడుకుతో మరాఠీలో మాట్లాడబోతే అడ్డుకుని హిందీలోనో, ఇంగ్లీషులోనో మాట్లాడాలని షరతు పెట్టారు. ఇద్దరి మధ్యా ఓ చిన్న ఇంటర్‌ కమ్‌ లాంటిది పెట్టి- ప్రతీ మాటకు ముందూ ఓ అధికారి స్విచాఫ్‌ చేసి- ‘ఇపుడేం మాట్లాడేవో చెప్పు’ అని ప్రశ్నించారు. ఉన్న 40 నిమిషాల సేపూ ఇదే తంతు. భార్యాభర్తలిరువురినీ ఆలింగనం చేసుకోనివ్వలేదు. కొడుకుకు కొన్ని క్రిస్మస్‌ స్వీట్లు తీసుకెళ్ళింది అవంతి... వాటిని ఇవ్వడానికి వీల్లేదని పారేశారు’ అంటూ పాకిస్థాన్ పై స్వామి పరిపూర్ణానంద మండిపడ్డారు.

  • Loading...

More Telugu News