gv krishna reddy: భూ కబ్జా వ్యవహారంలో జీవీ కృష్ణారెడ్డి కుమార్తె శాలినికి నోటీసులు!

  • హైదరాబాద్ శివార్లలో భూకబ్జా
  • విచారణ జరపాలంటూ సీఎం కార్యాలయం ఆదేశం
  • భూములు అన్యాక్రాంతం అయ్యాయని తేల్చిన అధికారులు

హైదరాబాద్ శివార్లలోని శంకరపల్లి మండలం కొండగల్ గ్రామంలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ అసైన్డ్ భూములు, బిలాదాఖలా (మాతృక) భూములు అన్యాక్రాంతమయ్యాయని వార్తాపత్రికల్లో కథనాలు వచ్చాయి. ఈ కథనాలపై స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం వెంటనే విచారణ జరపాలంటూ రెవెన్యూ అధికారులను ఆదేశించింది.

ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఈ భూములను సర్వే చేశారు. అసైన్డ్, మాతృక భూములు అన్యాక్రాంతమైన విషయం నిజమేనని తేల్చారు. ఈ భూములను తమ అధీనంలో ఉంచుకున్న బ్లూస్ట్రీక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యజమాని శాలినీ భూపాల్ కు పీవోటీ యాక్టు కింద నోటీసులు జారీ చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీ కృష్ణారెడ్డి కూతురే శాలిని!

కొండగల్ పరిధిలోని 46.34 ఎకరాల అసెన్డ్ భూములు బ్లూస్ట్రీక్ కంపెనీ పేరుపై రిజిస్టర్ అయిపోయాయి. ఈ భూములతోపాటు పక్కనే ఉన్న మాతృక భూములను కూడా ఈ సంస్థ కబ్జా చేసినట్లు, ప్రహరీ గోడలను కూడా నిర్మించినట్లు నిర్ధారించి అధికారులు నోటీసులు జారీ చేశారు. భూములను తిరిగి ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో 15 రోజుల్లోగా తెలియజేయాలని నోటీసులో పేర్కొన్నారు. 

More Telugu News