Pakistan: సరిహద్దులు దాటి ఎవరూ రాలేదు... ఇండియాకు అంత సీన్ లేదు!: పాకిస్థాన్

  • సరిహద్దులు దాటి వెళ్లిన భారత జవాన్లు
  • ముగ్గురు పాక్ సైనికుల హతం
  • ఎప్పటిలానే అదేం కాదన్న పాక్ 
  • దౌత్యాధికారికి సమన్లు జారీ చేసిన పాక్ విదేశాంగ శాఖ

ఐదుగురు భారత కమాండోలు కాశ్మీర్ లోని పూంచ్ సెక్టారులో వాస్తవాధీన రేఖను దాటి పాక్ సైనికులపై దాడులు జరిపి రావడంపై ఆ దేశం స్పందించింది. తమ సరిహద్దులను దాటి ఎవరూ రాలేదని, భారత సైన్యానికి అంత సీన్ లేదని వ్యాఖ్యానించింది. తమ జవాన్లు ముగ్గురు మరణించిన మాట వాస్తవమేనని, అయితే, అది భారత సైనికుల పని కాదని తెలిపింది.

రెండు రోజుల క్రితం పాక్ కు చెందిన 'బ్యాట్' టీమ్, సరిహద్దులు దాటి వచ్చి నలుగురు భారత జవాన్లను దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా భారత జవాన్లు సర్జికల్ స్ట్రయిక్స్ స్థాయిలో కాకున్నా ఓ మోస్తరు దాడులు చేశారు. దీనిపై పాక్ విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేస్తూ, రక్ చిక్రీ ప్రాంతంలో భారత దళాలు తాము రెచ్చగొట్టకుండానే కాల్పులకు దిగాయని, కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పెట్టాయని ఆరోపించింది.

ఈ విషయంలో భారత డిప్యూటీ హై కమిషనర్ కు సమన్లు జారీ చేశామని పేర్కొంది. ఎల్ఓసీ దాటి వెళ్లామని భారత సైన్యం తప్పుడు మాటలు చెబుతోందని ఆరోపించింది. భారత దళాలు సరిహద్దులు దాటి జరిపే దాడులపై గతంలో చెప్పినట్టుగానే పాక్ ఇప్పుడూ చెప్పడం గమనార్హం.

More Telugu News