Jayalalita: ఓటుకు రూ. 10 వేలు... రూ. 20 నోటుపై కోడ్... గెలిచేందుకు దినకరన్ మాస్టర్ ప్లాన్!

  • కోడ్ రాసిన నోట్ ఇచ్చి రిజల్ట్స్ తరువాత డబ్బిస్తామన్న దినకరన్ వర్గం
  • ఇప్పుడు డబ్బు కోసం ఒత్తిడి తెస్తున్న ఓటర్లు
  • అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన స్థానిక నేతలు

తమిళనాడులో జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలిచిన శశికళ వర్గం అభ్యర్థి టీటీవీ దినకరన్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆయన గెలుపునకు దారితీసిన కారణాలు ఏమై ఉన్నప్పటికీ, ఓటుకు రూ. 10 వేల వరకూ దినకరన్ వర్గం ఆఫర్ చేసినట్టు ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. అయితే, గతంలోలా డైరెక్టుగా డబ్బులివ్వకుండా, రూ. 20 నోట్లపై కోడ్ రాసి, వాటిపై ఓటరు సంఖ్య నంబరేసి, వాటిని ఓటర్లకు పంచినట్టు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చాక, ఆ కోడ్ రాసిన నోట్ చూపితే మొత్తం డబ్బు చెల్లిస్తామని చెప్పారట.

ఇప్పుడు ఈ డబ్బులు మార్చుకునే చోట గొడవ జరుగగా, నలుగురు దినకరన్ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికలకు ముందు రూ. 20 నోటిచ్చి, తాము గెలవగానే రూ. 10 వేలు ఇస్తామని దినకరన్ మనుషులు తమ వద్దకు వచ్చారని పలువురు వ్యాఖ్యానించారు. అయితే, మరో వివాదంలోకి వెళ్లదలచుకోని దినకరన్, డబ్బు పంపిణీ బాధ్యతనంతా ఆర్కే నగర్ లోని ఎంపిక చేసిన స్థానికులకు మాత్రమే అప్పగించినట్టు తెలుస్తోంది.

రూ. 20 నోట్ల పంపకం సజావుగా సాగగా, ఇప్పుడు ప్రతి ఒక్కరూ వచ్చి స్థానికంగా ఉన్న నేతలను ఓటర్లు నిలదీస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక పాలుపోని స్థితిలో ఉన్న స్థానిక నేతలు, ఫోన్లు స్విచ్చాఫ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

More Telugu News