tejaswi yadav: మా నాన్నను రాజకీయంగా సమాధి చేశామనుకోవద్దు: బీజేపీపై తేజస్వి ఫైర్

  • సీబీఐ కోర్టు తీర్పులో కుట్ర ఉంది
  • హైకోర్టులో అప్పీల్ చేస్తాం
  • బీజేపీకి మద్దతు పలికి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది

దాణా కుంభకోణంలో ఆర్జీడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను సీబీఐ కోర్టు దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, లాలూ జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత ఆయన కుమారుడు, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీపై ఆయన మండిపడ్డారు.

లాలూను జైలుకు పంపడం ద్వారా ఆయనను రాజకీయ సమాధి చేశామని వైరి పక్షాలు భావిస్తే... అది వారి మూర్ఖత్వమే అవుతుందని అన్నారు. ఇదే కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా సహా మరి కొందరిని సీబీఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించడం పట్ల ఆయన అనుమానాలను వ్యక్తం చేశారు.

ఒకవేళ బీజేపీతో తన తండ్రి చేతులు కలిపి ఉంటే... వారికి ఆయన సత్య హరిశ్చంద్రుడిలా కనిపించేవారని తేజస్వి అన్నారు. సీబీఐ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని తెలిపారు. హైకోర్టులో న్యాయం జరుగుతుందనే నమ్మకం తమకు ఉందని అన్నారు. 

More Telugu News