New Delhi: మూడేళ్ల శ్రమ, పక్కా ప్లాన్... ఎట్టకేలకు 'సెక్స్ ట్రేడ్ క్వీన్' గీతా అరోరా అరెస్ట్!

  • గతంలో అరెస్టయి నిర్దోషిగా బయటకు వచ్చిన గీతా అరోరా
  • ఆ తరువాత కూడా సెక్స్ ట్రేడ్ ఆరోపణలు
  • తొలి బాధితురాలిని వెతికి పట్టుకున్న ఢిల్లీ పోలీసులు
  • పక్కా ఆధారాలు సంపాదించి మరీ అరెస్ట్

గతంలో అమ్మాయిల అక్రమ రవాణా, లైంగిక వేధింపులు, వ్యభిచారం కేసులో అరెస్టయి, ఆపై సాక్ష్యాలు లేక నిర్దోషిగా బయటకు వచ్చిన ఢిల్లీ 'సెక్స్ ట్రేడ్ క్వీన్' గీతా అరోరా అలియాస్ సోనూ పుంజాబన్ ను మూడేళ్ల శ్రమ అనంతరం పక్కా ప్లాన్ చేసి, పక్కా ఆధారాలతో సహా పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. గీత చేతికి చిక్కి, నరకాన్ని అనుభవించిన ఓ అమ్మాయి ఫిర్యాదుతో, 2014లో ఆమెను అరెస్ట్ చేయగా, కోర్టులో సాక్ష్యం చెప్పేందుకు ఆమె రాకపోవడంతో అప్పట్లో గీత నిర్దోషిగా బయటకు వచ్చింది. అంతకుముందు నుంచే గీతపై సెక్స్ ట్రేడ్ ఆరోపణలు ఉన్నాయి. ఆమెపై కేసులు కూడా నమోదయ్యాయి.

తనకు పట్టుబడిన మైనర్ బాలికలకు అందంగా తయారు కావడం నుంచి వచ్చే విటులతో ఇంగ్లీషులో మాట్లాడటం వరకూ గీత నేర్పించేది. బాలికల శరీరంలోకి డ్రగ్స్ ఎక్కించి, వారిని విటుల వద్దకు పంపేది. గీత సామ్రాజ్యం ఢిల్లీతో పాటు లక్నో, రోహ్ తక్ ప్రాంతాలకూ విస్తరించింది. ఆమెను ఎలాగైనా పట్టుకోవాలన్న పోలీసులు ఎంతో కష్టపడ్డారు. తొలుత కేసు పెట్టిన బాధితురాలినే వెతికి పట్టుకోవాలని 2014 నుంచి ప్రయత్నించారు. మధ్యలో ఓ మారు ఆమె దొరికినట్టే దొరికి తప్పించుకుంది. తాను కోర్టుకు వస్తే గీత చంపేస్తుందన్నది ఆమె భయం.

మరోసారి ఆమె ఆచూకీని పసిగట్టిన పోలీసులు, ఈసారి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గీత దురాగతాలను చెప్పాలని కోరారు. గీతతో పాటు ఈ సెక్స్ ట్రేడ్ లో మరో 12 మంది ఉన్నారని బాధితురాలు చెప్పింది. ఆ స్థావరాలన్నింటిపైనా దాడులు చేసిన పోలీసులు, పక్కా ఆధారాలు సంపాదించారు. గీతతో సహా పలువురిని అరెస్ట్ చేశామని క్రైమ్ బ్రాంచ్ డీసీపీ భీష్మ సింగ్ వెల్లడించారు. ఈ దఫా ఆమె తప్పించుకోకుండా చూస్తామని అన్నారు.

More Telugu News