h1b: హెచ్‌-1బీ వీసా జారీని మ‌రింత‌ క‌ఠిన‌త‌రం చేయ‌నున్న అమెరికా

  • ప్ర‌తిపాద‌న‌లు పంపిన హోంల్యాండ్ సెక్యూరిటీ
  • ద‌రఖాస్తు చేసుకోవ‌డానికి ముందు క్యాప్ లాట‌రీ రిజిస్ట్రేష‌న్‌
  • ఎక్కువ నైపుణ్యాలు గ‌ల‌వారికి ప్రాధాన్యం

అమెరికాలోని కంపెనీల్లో ఉద్యోగం చేయాలంటే త‌ప్ప‌నిస‌రిగా ఉండాల్సిన హెచ్‌-1బీ వీసా జారీ విధానాన్ని మ‌రింత క‌ఠిన‌త‌రం చేసేందుకు అమెరికా య‌త్నిస్తోంది. ఈ మేర‌కు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్ర‌తిపాద‌న‌లు కూడా సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది. 2011లో చేసిన ప్ర‌తిపాద‌న‌ల‌ను హోంల్యాండ్ సెక్యూరిటీ పున‌రుద్ధ‌రించ‌నుంది.

ఈ స‌వ‌ర‌ణ‌ల ప్ర‌కారం.. హెచ్‌-1బీ కోసం దరఖాస్తు చేసుకునే పిటిషన్‌దారులు ముందుగా హెచ్‌-1బీ క్యాప్‌ లాటరీ కోసం రిజిస్టర్‌ చేసుకోవాలి. క్యాప్‌ నంబర్లు వచ్చిన తర్వాతే వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నంబర్లను ఇవ్వడంలో ప్రాధాన్యత పద్ధతిని పాటించాలని హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ ప్రతిపాదిస్తోంది. అంటే ఎక్కువ నైపుణ్యాలు కలిగిన వారికి, ఎక్కువ జీతం వచ్చే వారికి ఈ క్యాప్‌ నంబర్లలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

వీటితో పాటు హెచ్‌-1బీ ఉద్యోగుల వేతనాల్లోనూ మార్పులు చేసే అవకాశం ఉంద‌ని ఇమ్మిగ్రేష‌న్ సంస్థ ఫ్రాగోమెన్ పేర్కొంది. ఇప్ప‌టికే హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగాలు చేయకుండా ఉండేలా నిబంధ‌న‌లు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌ళ్లీ కొత్త‌గా ఈ క్యాప్ లాట‌రీ రిజిస్ట్రేష‌న్ వ‌ల్ల హెచ్‌-1బీ వీసా జారీ మ‌రింత క‌ఠిన‌త‌రం అయ్యే అవ‌కాశం ఉంది.

More Telugu News