TTV Dinakaran: మారుతున్న రాజకీయం... దినకరన్ ఇంటికి క్యూ కడుతున్న నేతలు

  • రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన ఆర్కే నగర్
  • దినకరన్ విజయంతో మారుతున్న సమీకరణాలు
  • దినకరన్ వైపునకు జంప్ చేయనున్న మంత్రులు, ఎమ్మెల్యేలు
  • 12 గంటలకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిన దినకరన్

తమిళనాడులో ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఫలితం రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేస్తోంది. నిన్నటి నుంచి దినకరన్ ఇంటికి వస్తున్న అన్నాడీఎంకే నేతల సంఖ్యను చూస్తున్న పరిశీలకులు, భారీ మార్పులు సంభవిస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ ఉదయం కూడా దినకరన్ నివాసం అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలతో కిక్కిరిసి కనిపిస్తోంది.

 కొందరు ఎమ్మెల్యేలు కూడా దినకరన్ తో మాట్లాడి, తామంతా వెంట నిలుస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. నిన్న తన విజయం ఖరారైన తరువాత, మూడు నెలల్లోనే ప్రభుత్వం పడిపోతుందని దినకరన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆందోళనలో ఉన్న ప్రభుత్వం ఆయనకు మద్దతిచ్చే నేతలు ఎవరన్న విషయాన్ని ఆరా తీసే పనిలో పడింది.

ఇక ఈ ఉదయం 11 గంటలకు ఈపీఎస్, ఓపీఎస్ వర్గాల సమావేశం జరుగనుండగా, 12 గంటలకు తన వర్గం నేతలతో ప్రత్యేకంగా సమావేశం కావాలని టీటీవీ దినకరన్ నిర్ణయించారు. అమ్మకు తానే అసలైన రాజకీయ వారసుడినని ఇప్పటికే ప్రకటించుకున్న ఆయన, సమీప భవిష్యత్తులో ఎటువంటి ఎత్తులను వేయనున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రజాప్రతినిధుల్లో పలువురు దినకరన్ వర్గంలోకి చేరిపోయే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. మంత్రులు, ఎమ్మెల్యేలు చేజారిపోకుండా పన్నీర్ సెల్వం, పళనిస్వామిలు ఎలాంటి వ్యూహం పన్నుతారో వేచి చూడాలి.

More Telugu News