Goa: ఒక రోజు స్టేకు రూ. లక్ష... గోవాలో న్యూ ఇయర్ రద్దీ!

  • చుక్కలను తాకుతున్న అద్దెలు
  • అదనంగా 28 శాతం జీఎస్టీ బాదుడు
  • డిమాండ్ అధికం కావడంతోనే అద్దెలు పెంచామంటున్న హోటల్స్

కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకునేందుకు గోవా వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? ఒక్క క్షణం ఆలోచించండి. డిసెంబర్ 31న రాత్రి స్టే చేయాలంటే గోవాలో రూ. లక్షకు పైగా చెల్లించుకోవాల్సి వుంటుంది. తాజ్ ఎక్సోటిక్ రిసార్టులో గది అద్దె రూ. 1,04,320కు చేరుకోగా, తాజ్ ఫోర్ట్ లో రూ. 67,040కి ధర పెరిగింది. కొత్త సంవత్సరం వేడుకలు వైభవంగా జరిగే గోవాలో హోటల్ గదులకు డిమాండ్ అధికంగా ఉండటంతోనే అద్దెలను పెంచామని, జీఎస్టీ ప్రభావం కూడా ఆతిథ్యరంగంపై అధికంగానే ఉందని ఈ రంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

'మేక్ మై ట్రిప్' వెబ్ సైట్ లో చూపుతున్న వివరాల ప్రకారం తాజ్ ఎక్సోటికా లో గది అద్దె రూ. 81,500 కాగా, 28 శాతం జీఎస్టీ రూ. 22,820 అదనపు భారం. ఇక ఇదే హోటల్ లో జనవరి 31న రూమ్ కావాలంటే కేవలం రూ. 20,700 చెల్లిస్తే సరిపోతుంది. ఇక తాజ్ ఫోర్ట్ హోటల్ లో రూమ్ అద్దె రూ. 52,200 ఉండగా, జీఎస్టీ రూ. 14,840. ఇదే హోటల్ లో గదిని జనవరి 31న బుక్ చేసుకోవాలంటే, జీఎస్టీతో కలిపి రూ. 17,120 చెల్లిస్తే సరిపోతుంది. లీలా గోవా హోటల్ లో కాంప్లిమెంటరీ బ్రేక్ ఫాస్ట్ కలిపి రూముకు రూ. 71,666 వసూలు చేస్తున్నారు.

ఇదే డబ్బుతో జనవరి మధ్యలో దుబాయ్ లేదా బాలీ వంటి ప్రాంతాలకు ఓ జంట విమానంలో వెళ్లి, అక్కడ ఐదారు రోజులు బస చేసి, తిరిగి రావచ్చు.

గోవా విషయం అలా ఉంచితే, రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ వంటి టూరిస్టు స్పాట్ లను పరిశీలిస్తే, అక్కడి హోటల్స్ లో గదులన్నీ ఇప్పటికే ఫుల్ అయ్యాయి. తాజ్ లేక్ పాలెస్, ట్రైడెంట్ వంటి స్టార్ హోటల్స్ ఇప్పటికే డిసెంబర్ 31కి గదులు లేవని చెప్పేస్తున్నాయి. జైపూర్, మనాలీ వంటి ప్రాంతాల్లోనూ ఇదే విధమైన పరిస్థితి నెలకొంది. బడ్జెట్ హోటల్ చైన్ ఓయో సైతం ఈ డిసెంబర్ 31 గదుల అద్దెను 30 శాతం వరకూ పెంచింది. కార్బెట్, రణతంబోర్, మౌంట్ అబూ, పంచ్ మార్షి వంటి ప్రాంతాల్లో గదుల అద్దెలు 50 శాతం వరకూ పెరిగాయి.

More Telugu News