lalu prasad yadav: లాలూ నాపై చాలా ఒత్తిడి తెచ్చారు.. కేసు విచారణలో చాలా ఇబ్బందులు పడ్డాను!: సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌

  • ఈ కేసును విచార‌ణ చేసే స‌మ‌యంలో అనేక ఇబ్బందులు ఎదుర్కున్నాను
  • లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ఎన్నో నాటకాలు ఆడేవారు
  • దేవెగౌడ, ఐకే గుజ్రాల్‌, సీబీఐ డైరెక్ట‌ర్‌ ఒత్తిడి తెచ్చారు
  • ఈ కేసు విచారణ పూర్తి చేసి సీబీఐకి అప్పగించా

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్ గ‌తంలో త‌న‌తో ప్ర‌వ‌ర్తించిన‌ తీరు ప‌ట్ల సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ ఉపెన్‌ విశ్వాస్ స్పందిస్తూ ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ... లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ఎన్నో నాటకాలు ఆడేవార‌ని చెప్పారు. లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌ కేసును విచారించాలని త‌న‌కు ఆదేశాలు వచ్చిన వెంటనే జ‌రిగిన అనుభ‌వాన్ని వివ‌రించారు. త‌న‌కు అధికారుల నుంచి ఆ ఆదేశాలు రాగానే త‌న‌కు బీహార్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నుంచి ఫోన్‌ వచ్చిందని తెలిపారు.

కానీ, ఆ ఫోన్ కాల్ మాట్లాడింది మాత్రం లాలూనే అని ఉపెన్‌ విశ్వాస్ చెప్పారు. ఈ కేసు విచార‌ణ‌ విషయంలో తన ఇమేజ్‌ దెబ్బతగలకుండా చూడాలని ఆయన త‌న‌ని కోరార‌ని తెలిపారు. తాను అగ్ర కులస్తుడిని కాదని లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ త‌న‌తో చెప్పి సానుభూతి పొందాల‌నుకున్నార‌ని చెప్పారు. తనను పాట్నాలో మాత్ర‌మే విచారించాలని కోరార‌ని తెలిపారు. అంతేకాకుండా దేవెగౌడ, ఐకే గుజ్రాల్‌వంటి వారితోను, సీబీఐ డైరెక్ట‌ర్‌తోను మాట్లాడించి త‌న‌పై ఒత్తిడి తెచ్చార‌ని అన్నారు. తాను అనేక ఇబ్బందులు ప‌డి విచారణ పూర్తి చేస్తే, త‌మ పైఅధికారులు మాత్రం ఆయ‌న‌ను అరెస్టు చేసేందుకు అవకాశం ఇవ్వలేదని తెలిపారు.

దీంతో న్యాయ‌స‌ల‌హా తీసుకుని మిలిటరీ అధికారుల సాయంతో ఆయనను అరెస్టు చేద్దామనుకున్నానని ఉపెన్‌ విశ్వాస్ చెప్పారు. అయినప్ప‌టికీ త‌న ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేద‌ని తెలిపారు. ఈ విష‌యంపై తనకు పై అధికారుల నుంచి షోకాజ్‌ నోటీసులు వచ్చాయని, చివరికి ఈ కేసు విచారణ పూర్తి చేసి సీబీఐకి అప్పగించానని చెప్పారు.

More Telugu News