bjp: ప్ర‌ధాని మోదీ, అరుణ్ జైట్లీ, అమిత్ షా జాతికి క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి: ఏపీసీసీ

  • బీజేపీ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించింది
  • 2జీ స్పెక్ట్రం కుంభ‌కోణం విష‌యంలో అవాస్త‌వాలు ప్ర‌చారం చేశారు
  • బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌కు కాంగ్రెస్ డిమాండ్‌

2జీ స్పెక్ట్రం కుంభ‌కోణం విష‌యంలో యూపీఏ ప్ర‌భుత్వాన్ని త‌ప్పుబ‌డుతూ, అవాస్త‌వాల‌ను ప్ర‌చారం చేసి బీజేపీ నాయ‌కులు దేశ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ పట్టించార‌ని, అందుకుగాను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా వెంట‌నే జాతికి బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న‌ట్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ ఓ ప‌త్రికా ప్ర‌క‌ట‌న ద్వారా డిమాండ్ చేశారు.

2జీ స్పెక్ట్రం కుంభ‌కోణంలో నిందితులంద‌రినీ నిర్దోషులుగా ప్ర‌క‌టిస్తూ సీబీఐ ప్ర‌త్యేక కోర్టు తీర్పునిచ్చాక కూడా  బీజేపీ మంత్రులు, నేత‌లు కువిమ‌ర్శ‌లు చేస్తుండ‌టం సిగ్గుచేటని శివాజీ పేర్కొన్నారు. ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం కోసం ఈ కుంభ‌కోణాన్ని తెర‌మీదికి తీసుకువ‌చ్చి యూపీఏ ప్ర‌భుత్వం, కాంగ్రెస్ పార్టీల‌పై అవాస్త‌వాలు ప్ర‌చారం చేశార‌ని ఆరోపించారు. 2జీ స్పెక్ట్రం కేటాయింపులను అతిపెద్ద కుంభ‌కోణంగా వెల్ల‌డించిన అప్ప‌టి కాగ్ వినోద్ రాయ్‌ని విచారిస్తే బీజేపీ కుట్ర‌లు బ‌య‌ట‌ప‌డ‌తాయ‌ని అన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో కోట్లాది రూపాయ‌ల నిధుల దుర్వినియోగం గురించి సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించాల‌ని కాంగ్రెస్‌ డిమాండ్ చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

More Telugu News