yogi adithyanath: కర్ణాటకలో హనుమంతుడికి, టిప్పు సుల్తాన్ కు మధ్యే పోటీ: యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు

  • కర్ణాటక హనుమంతుడి భూమి
  • కాంగ్రెస్ మాత్రం టిప్పు సుల్తాన్ జన్మదిన వేడుకలు జరుపుతోంది
  • కాంగ్రెస్ కు ఓటమి తప్పదు

దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ కార్యాచరణ మొదలుపెట్టింది. వచ్చే ఏడాది కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను బీజేపీ కర్ణాటక రంగంలోకి దింపింది. నిన్న మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప అధ్యక్షతన జరిగిన పరివర్తన ర్యాలీని యోగి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.

కర్ణాటకలో జరగబోయే ఎన్నికల్లో హనుమంతుడు, ఆయనకు పోటీగా టిప్పు సుల్తాన్ బరిలోకి దిగుతున్నారని యోగి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకను హనుమంతుడి భూమిగా గుర్తిస్తారని, కానీ కాంగ్రెస్ మాత్రం ఆయనను పూజించకుండా టిప్పు సుల్తాన్ జన్మదిన వేడుకలు జరుపుతుందని మండిపడ్డారు. టిప్పు సుల్తాన్ ను స్వాతంత్ర్య సమర యోధుడిగా చెబుతున్న కాంగ్రెస్ ను హనుమంతుడు ఓడిస్తాడని చెప్పారు. ఓ వైపు బీజేపీ కార్యకర్తల హత్యలు జరుగుతుంటే... కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో నిరంకుశ పాలన కొనసాగుతోందని విమర్శించారు. 

More Telugu News