India: నరేంద్ర మోదీ కొత్త చట్టం భయం... బ్యాంకుల వద్దకు పరుగులు తీస్తున్న జనం!

  • బ్యాంకుల నుంచి డబ్బు విత్ డ్రా చేసుకుంటున్న ప్రజలు
  • ఎఫ్ఆర్డీఐ చట్టం వస్తుందన్న భయంతోనే
  • ప్రభుత్వం డిపాజిట్ డబ్బు తీసుకుంటుందని ప్రచారం
  • అంతా వదంతులేనని, నమ్మవద్దంటున్న బ్యాంకులు

ప్రధాని నరేంద్ర మోడీ ఎఫ్ఆర్డీఐ (ఫైనాన్షియల్ రెజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్స్యూరెన్స్) బిల్లును తెస్తున్నారని, ఇది అమలులోకి వస్తే, బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లను ప్రభుత్వం వాడుకుంటుందన్న ప్రచారం జోరుగా సాగుతుండగా, ప్రజలు తీవ్ర ఆందోళనతో బ్యాంకుల వద్దకు పరుగులు తీస్తున్నారు. వరంగల్ లో నిన్న ఒక్కరోజులోనే రెండు బ్యాంకుల నుంచి రూ. 6 కోట్ల నగదు విత్ డ్రా కాగా, ఖాతాదారులకు నచ్చజెప్పలేక అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. తమ ఖాతాలను ఖాళీ చేస్తున్న ప్రజలు, డిపాజిట్లను సైతం వెనక్కు తీసుకుంటుండగా, ఈ ప్రచారం ఇతర పట్టణాలకూ పాకింది. ఈ ఉదయం పలు పట్టణాల్లోని బ్యాంకుల వద్ద జనం తమ డబ్బులను వెనక్కు తీసుకునేందుకు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తోంది.

 ఇక కొత్త చట్టం ఏమీ రాదని, ఎవరి డబ్బుకూ ఇబ్బంది ఉండదని బ్యాంకుల మేనేజర్లు చెబుతుంటే, ఇప్పటికి మాత్రం తమ డబ్బు వెనక్కు ఇవ్వాలని, అటువంటి బిల్లు రాకుంటే అప్పుడు తిరిగి డిపాజిట్ చేస్తామని ఖాతాదారులు చెబుతుండటం గమనార్హం. వరంగల్ లోని ఓ బ్యాంకులో 30 వరకూ ఫిక్సెడ్ డిపాజిట్లు ఉండగా, అందులో 15 మంది తమ డబ్బును వెనక్కు తీసుకోవడం గమనార్హం. దిగువ, మధ్య తరగతి ప్రజలు అధికంగా బ్యాంకులకు వస్తున్నారని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. కాగా, వాట్స్ యాప్ లో జరుగుతున్న ప్రచారాన్ని చూసి తాము డబ్బు విత్ డ్రా కోసం వచ్చినట్టు పలువురు వ్యాఖ్యానించారు. ఇక ఇదంతా వదంతేనని, ఇటువంటి ప్రచారం తగదని, ఖాతాదారులను అయోమయంలో పడవేయవద్దని, ఈ ప్రచారాన్ని నమ్మవద్దని బ్యాంకుల అధికారులు కోరుతున్నారు.

More Telugu News