Badminton: నేను గొంతు చించుకున్న నాడు ఒక్కరూ మాట్లాడలేదేం?: గుత్తా జ్వాల ఫైర్

  • సింగిల్స్ గెలిచిన వారికి కారులు
  • డబుల్స్ విజేతలకు రూ. 26 వేలతో సరి
  • 'బాయ్' వైఖరిపై సీనియర్ల ఆగ్రహం
  • నాడు తనకెందుకు మద్దతుగా రాలేదని ప్రశ్నించిన జ్వాల

భారత బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బాయ్‌) వైఖరిపై జూనియర్ ఆటగాళ్లు మూకుమ్మడిగా విమర్శలు చేసిన వేళ, బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి గుత్తా జ్వాల స్పందించింది. నేషనల్ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ అండర్‌-19 పోటీల్లో సింగిల్స్‌ విజేతలకు కారును బహుమతిగా ఇచ్చి, డబుల్స్‌ టైటిళ్లు గెలిచిన వారికి రూ. 26 వేలు మాత్రమే ఇచ్చి అవమానించారంటూ, అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి, ప్రణవ్‌ చోప్రాలు ఆవేదన వ్యక్తం చేయగా, గతంలో తాను ఇదే విషయమై నెత్తీ నోరూ బాదుకుని విషయాన్ని వెలుగులోకి తెచ్చినా, ఎవరూ పట్టించుకోలేదని గుత్తా జ్వాల వ్యాఖ్యానించింది.

బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో వివక్ష జరుగుతోందని, తాను ఎన్నోసార్లు గళమెత్తానని, అప్పుడు మాట్లాడని వారంతా, ఇప్పుడు ఒకేసారి ఆందోళన చేస్తున్నారని విమర్శలు గుప్పించింది. తాను ఇప్పుడు ఆడటం లేదు కాబట్టే, వాళ్లకు న్యాయం కావాలని కోరుకుంటున్నారని, ద్వంద్వ ప్రమాణాలంటే ఇవేనని నిప్పులు చెరిగింది. బ్యాడ్మింటన్ లో విజయం అన్నది ఆడిన వ్యక్తి ఖాతాలోకి వెళుతుందని, ఆరోపణలు వస్తే నిందలు బ్యాడ్మింటన్ సంఘంపై పడతాయని చెప్పింది.

More Telugu News