Jayalalitha: జయలలిత వీడియోను నాకు తెలియకుండానే విడుదల చేశారు.. టీటీవీ దినకరన్

  • నా అనుచరుడు వెట్రివేల్ దానిని బయటపెట్టాడు
  • ‘అమ్మ’ తీయమంటేనే రికార్డు చేశాం
  • ఏప్రిల్‌లోనే విడుదల చేయమన్నారు కానీ జయ నైటీతో ఉన్నారని ఆ పని చేయలేదు
  • అడిగితే విచారణ సంఘానికి ఇస్తా

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అస్వస్థతతో అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటూ బెడ్ మీద ఉన్నప్పటి వీడియో బయటకు రావడం సంచలనం సృష్టించింది. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో లబ్ధి పొందేందుకే దినకరన్ వర్గం ఈ వీడియోను విడుదల చేసిందన్న ఆరోపణలున్నాయి.

వీటిపై స్పందించిన దినకరన్ మీడియాతో మాట్లాడుతూ.. తనకు తెలియకుండానే ఈ వీడియో బయటకు వచ్చిందన్నారు. తన అనుచరుడైన వెట్రివేల్ దీనిని విడుదల చేశారని పేర్కొన్నారు. విడుదలైనది ప్రైవేట్ వీడియో అని, తాను ఎలా ఉన్నానో తెలుసుకోవడానికి ‘అమ్మ’ తీయమంటేనే రికార్డు చేశామని దినకరన్ వివరించారు. ఈ విషయం సీఎం పళనిస్వామి సహా అందరికీ తెలుసన్నారు.

శశికళ జైలుకు వెళ్లే ముందు ఆ వీడియో తన చేతికి వచ్చిందని దినకరన్ తెలిపారు. విచారణ కమిషన్ కోరితే ఆ వీడియోను సమర్పించేందుకు సిద్ధమని పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 12న ఆర్కేనగర్ ఉప ఎన్నిక సమయంలో ఈ వీడియోను విడుదల చేయాలని మంత్రులు కోరినా జయలలిత నైటీతో ఉన్న కారణంగా విడుదల చేయలేదన్నారు. కాగా, ఆ ఎన్నికను ఈసీ అప్పట్లో వాయిదా వేసింది.

More Telugu News