Telugudesam: అటవీహక్కుల చట్టం కింద త్వరలో లక్ష అర్జీలకు పరిష్కారం: ఏపీ మంత్రి నక్కా ఆనంద్ బాబు

  • అటవీహక్కుల చట్టం కింద పరిష్కరిస్తాం
  • ఈ నెలాఖరులోగా 20 వేల అర్జీలను పరిష్కరిస్తాం
  • ప్రతి గిరిజన రైతుకూ ఎన్ఎస్టీఎఫ్డీసీ ద్వారా రూ.లక్ష రుణం 

రాష్ట్రంలో అటవీహక్కుల చట్టం కింద పెండింగ్ లో ఉన్న లక్ష అర్జీలను త్వరలో పరిష్కరించనున్నామని ఏపీ సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. సద్భావన, విజ్ఞాన యాత్ర ముగించుకున్న సీతంపేట, పార్వతీపురం, పాడేరు, రంపచోడవరం ఐటీడీఏలకు చెందిన 80 మంది ఔత్సాహిక గిరిజన రైతులు సచివాలయ సందర్శనకు ఈరోజు వెళ్లారు. ఈ సందర్భంగా వారితో తన కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు.

 విజ్ఞాన యాత్రలో తెలుసుకున్న అంశాల గురించి గిరిజన రైతులను అడిగి ఆయన తెలుసుకున్నారు. అనంతరం నక్కా ఆనంద బాబు మాట్లాడుతూ, మన్యంలోని ప్రతి గిరిజన కుటుంబానికీ నెలకు రూ.10 వేల ఆదాయం వచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని, ఇందులో భాగంగా గిరిజన రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి సద్భావన, విజ్ఞాన యాత్ర నిర్వహించిందని చెప్పారు. ఈ నెలాఖరులోగా 20 వేల అర్జీలకు పరిష్కారం చూపి, భూమి హక్కు పత్రాలు ఇవ్వనున్నామని, గిరిజన భూముల్లో బోర్లు వేయడంతో పాటు పెట్టుబడుల కోసం రుణాలు కూడా అందివ్వనున్నట్టు తెలిపారు.

ఏజెన్సీలోని భూములకు సాగునీటి కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ట్రైకార్, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా బోర్లు వేయడానికి చర్యలు తీసుకుంటున్నామని, వ్యవసాయ పెట్టుబడుల కోసం ఎన్ఎస్టీఎఫ్డీసీ ద్వారా రూ.లక్ష రుణం ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. అయితే, ఇందులో పావలా వడ్డీ కింద రుణంగా రూ.90 వేలు ఇస్తామని, మిగిలిన రూ.10 వేలు లబ్ధిదారులు భరించాల్సి ఉంటుందని చెప్పారు. దశలవారీగా గిరిజనులందరికీ ఈ రుణాలు అందజేస్తామని చెప్పారు.  

అనంతరం, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్.పి.సోసిడియా మాట్లాడుతూ, అటవీహక్కుల చట్టం ద్వారా భూమి హక్కులు పొందిన గిరిజన రైతులు భూములను వృథాగా ఉంచొద్దని సూచించారు. పంటల సాగు చేస్తూ, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. భూమి హక్కుల పత్రాలు పొందిన వారు గిరిజనేతరులకు భూములను విక్రయిస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.     

  • Loading...

More Telugu News