forbes: 2017లో ఎక్కువ సంపాదించిన బిలియ‌నీర్ జెఫ్ బెజోస్

  • 33.8 బిలియన్ డాల‌ర్ల సంపాద‌న‌
  • మొత్తం ఆస్తి విలువ‌ 98.6 బిలియ‌న్ డాల‌ర్లు
  • వెల్ల‌డించిన ఫోర్బ్స్ మేగ‌జైన్‌

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న కోటీశ్వ‌రుల‌కు 2017 సంవ‌త్స‌రం ఆర్థికంగా క‌లిసొచ్చింది. అమెరికా స్టాక్ ఎక్చేంజ్ పుంజుకోవడం, చమురు ధ‌ర‌లు పెర‌గ‌డం, చైనా రియ‌ల్ ఎస్టేట్ లాభాలు వంటి అంశాల‌న్నీ వారికి క‌లిసొచ్చాయి. దీంతో ఇప్ప‌టికే బిలియ‌నీర్లుగా ఉన్న వారంతా మ‌రికొంత సొమ్మును వెన‌కేసుకున్నారు. ఈ సంపాద‌న‌కు సంబంధించిన ప్ర‌ముఖ మేగ‌జైన్ ఫోర్బ్స్ ఓ జాబితాను త‌యారు చేసింది. ఇందులో 2017లో బిలియ‌నీర్లు సంపాదించిన మొత్తాన్ని పేర్కొంది.

ఈ జాబితాలో 33.8 బిలియ‌న్ డాల‌ర్ల సంపాద‌న‌తో అమెజాన్ వ్య‌వ‌స్థాప‌కుడు జెఫ్ బెజోస్ ప్ర‌థ‌మ‌స్థానంలో ఉన్నారు. ఈ సంపాద‌న‌తో ఆయన మొత్తం ఆస్తి విలువ 98.6 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుకున్న‌ట్లు పేర్కొంది. అలాగే త‌ర్వాతి స్థానాల్లో చైనాకు చెందిన రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి హుయ్ కా యాన్ (27.4 బిలియ‌న్ డాల‌ర్లు, మొత్తం ఆస్తి విలువ‌ 36.5 బిలియ‌న్ డాల‌ర్లు), ఎల్వీఎంహెచ్ సీఈఓ బెర్నార్డ్ ఆర్నాల్ట్ (23.6 బిలియ‌న్ డాల‌ర్లు, మొత్తం ఆస్తి విలువ‌ 63.9 బిలియ‌న్ డాల‌ర్లు), మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ (23.6 బిలియ‌న్ డాల‌ర్లు, మొత్తం ఆస్తి విలువ‌ 72 బిలియ‌న్ డాల‌ర్లు), టెన్సెంట్ హోల్డింగ్స్ అధినేత మా హువాటెంగ్ (21.8 బిలియ‌న్ డాల‌ర్లు, మొత్తం ఆస్తి విలువ‌ 44.3 బిలియ‌న్ డాల‌ర్లు) ఉన్నారు.

ఇక ఆరోస్థానంలో ముకేశ్ అంబానీ ఉన్నారు. 2017లో 18 బిలియ‌న్ డాల‌ర్ల సంపాద‌న‌ను ముకేశ్ ఆర్జించారు. దీంతో క‌లిపి ఆయ‌న మొత్తం సంపాద‌న విలువ 41.1 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుకుంది. ఇంకా కార్లోస్ స్లిమ్ హేలూ కుటుంబం, యాంగ్ హుయాన్‌, లారీ ఎల్లిస‌న్‌, ఫ్రాంకోయిస్ ఫినాల్ట్ కుటుంబాలు టాప్ 10లో ఉన్నారు.

More Telugu News