Prapancha Telugu Mahasabhalu: వెలుగు జిలుగుల మధ్య అట్టహాసంగా ముగిసిన 'ప్రపంచ తెలుగు మహా సభలు'

  • ముగింపు సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న  భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 
  • హైదరాబాద్ అంటే బిర్యాని, బాడ్మింటన్, బాహుబలి గుర్తుకు వస్తాయన్న రాష్ట్రపతి
  • తెలుగు భాష పరిడవిల్లాలంటే మీడియా ముఖ్య పాత్ర పోషించాలన్న గవర్నర్
  • ప్రతి ఏటా డిసెంబర్ నెలలో రెండు రోజుల పాటు తెలుగు మహా సభలు నిర్వహిస్తామన్న ముఖ్యమంత్రి

ఐదు రోజుల పాటు తెలుగు భాషకు, సాహిత్యానికి, సాంస్కృతిక  సంప్రదాయలకు అద్దం పట్టేలా జరిగిన ప్రపంచ తెలుగు మహా సభలు మంగళవారంతో ముగిసాయి. లాల్ బహదూర్ స్టేడియంలో బమ్మెర పోతన వేదికగా అత్యంత వైభవంగా వెలుగు జిలుగుల మధ్య నిర్వహించిన ముగింపు సమావేశంలో  భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాష ప్రపంచ భాష అని, దక్షిణ ఆఫ్రికా నుండి ఆగ్నేయ ఆసియా దేశాల వరకు మాట్లాడే భాష తెలుగు అని, దేశం లో హిందీ తరువాత అత్యధికులు మాట్లాడే భాష తెలుగు అని ఆయన కొనియాడారు. ఈ భాష గొప్పతనాన్ని, గుర్తించిన ప్రభుత్వం 2008 లోనే తెలుగుకు ప్రాచీన భాష హోదాను కల్పించిందని, మానవ పరిణామ క్రమంలో తెలుగు ప్రాంతం పోషించిన కీలక పాత్ర  విస్మరించలేనిదని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా   ఫార్మా, సాంకేతిక, ఆర్ధిక, రాజకీయ, సామాజిక రంగాలలో ఎందరో తెలుగు వారు పేరు ప్రఖ్యాతులు పొందారని అంటూ సత్య నాదెళ్ళ పేరును, యెల్లా ప్రగడ సుబ్బారావు పేర్లను ఆయన ఉదాహరించారు. తెలుగు సాహితీ సౌరభాన్ని వెదజల్లిన వట్టికోట ఆళ్వారు స్వామి, దాశరథి, త్యాగరాజు, అన్నమయ్య, వంటి గొప్ప కవులతో పాటు సామాజిక వికాసానికి, చైతన్యానికి, పోరాటానికి  స్ఫూర్తిగా నిలిచిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీం, చిట్యాల ఎల్లమ్మ, భాగ్య రెడ్డి వర్మ వంటి యోధులు కూడా జన్మించిన పుణ్య భూమి తెలుగు గడ్డ అని ప్రశంసించారు. వీరే కాకుండా దేశానికి రాష్ట్రపతులు గా పనిచేసిన డా. యస్. రాధాకృష్ణన్, వి.వి. గిరి, నీలం సంజీవ్ రెడ్డి, ప్రధానమంత్రిగా పనిచేసిన పి.వి. నరసింహరావు  బహు భాషా కోవిదులని రాష్ట్రపతి అన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రం అన్ని రంగాలలో ముందు ఉన్నదని అభినందించారు. హైదరాబాద్ అంటే బిర్యాని, బాడ్మింటన్, బాహుబలి గుర్తుకు వస్తాయని, విజయవంతంగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం తెలంగాణా రాష్ట్ర కీరిటంలో మరో కలికితు రాయి అని ఆయన అభివర్ణించారు.  

రాష్ట్ర గవర్నర్ ఇ.యస్. యల్ నర్సింహన్ మాట్లాడుతూ ఈ ఐదు రోజుల సభల్లో 18 రాష్ట్రాలు, 42  దేశాల నుండి ఎంతో మంది భాషాభిమానులు ఈ సభలకు హాజరయ్యారని అన్నారు. తెలుగు భాషనూ పరిరక్షించేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలకు తెలుగు పుస్తకాలు బహుకరించాలని, తెలుగు భాష పరిడవిల్లాలంటే మీడియా ముఖ్య పాత్ర పోషించాలని పిలుపునిచ్ఛారు. ఈ సందర్భంగా చేయ్యేత్తి జైకొట్టు తెలుగోడా అన్న రాయప్రోలు గీతాన్ని ఉటంకించారు 

రాష్ట్ర ముఖ్యమంత్రి  కె. చంద్రశేర్ రావు మాట్లాడుతూ తెలుగు భాష పరిపుష్టికి తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగా ప్రతి ఏటా డిసెంబర్ నెలలో రెండు రోజుల పాటు తెలుగు మహాసభలు నిర్వహించనున్నాం అని తెలిపారు. ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్ గా బోధించే ఉతర్వులను కచ్చితంగా అమలు పరుస్తామని అన్నారు. భాషా పండితుల సమస్యల పరిష్కారంలో గల న్యాయపరమైన అడ్డంకులను అధిగమించి అనతి కాలంలోనే వారి సమస్యలను పరిష్కరిస్తాం అని అన్నారు. ప్రధానంగా తెలుగుభాషను జీవ భాషగా ఉంచేందుకు పలు భాషాభిమానులు, సాహితీ వేత్తలు ఇచ్చిన సూచనలను క్రోడీకరించి  నిర్ణయాలు తీసుకొనేందుకు వీలుగా జనవరిలో సాహితీ సభను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.  తెలుగు మహాసభలను ఇంత ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన సాహిత్య అకాడమితో పాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా నవ్వుల పద్యాన్ని చదివి  ఆహుతులను అలరించారు. 

ఈ సందర్భంగా దీపికా రెడ్డి బృందం తెలంగాణ వైభవంపై అభినయించిన పేరిణి నృత్యం, తెలంగాణ వైభవంపై రూపొందించి ప్రదర్శించిన డాక్యుమెంటరి, ముగింపు సూచనగా నిర్వహించిన లేజర్ షో, బాణా సంచా వెలుగులు ప్రేక్షకులను ఎంతగాన్నో ఆకట్టుకున్నాయి. 

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్, శాసన సభాపతి మధుసూధనా చారి, యం.పి. లు  కె. కేశవరావు, జితేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. కార్యక్రమానికి సాహిత్య అకాడమి చైర్మన్ నందిని సిధ్దా రెడ్డి స్వాగతం పలుకగా ప్రభుత్వ సలహాదారు డా. కె.వి. రమణా చారి సంధాన కర్తగా వ్యవహరించారు.  సాంస్కృతిక  శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం వందన సమర్పణ చేశారు. 

  • Loading...

More Telugu News