Kurnool: టన్నుల కొద్దీ మట్టిని తవ్విపోస్తున్నా కానరాని భారీ నిధి... ఆస్థిపంజరాలను చూసి అధికారుల షాక్!

  • కర్నూలు జిల్లా చెన్నంపల్లి కోటలో వారం రోజులుగా తవ్వకాలు
  • ఈ ప్రాంతంలో గుప్త నిధులు ఉన్నాయని ప్రచారం
  • పోలీసుల సాయంతో రెవెన్యూ, మైనింగ్ అధికారుల తవ్వకాలు

కర్నూలు జిల్లా చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల కోసం వేట కొనసాగుతోంది. గడచిన ఏడు రోజులుగా పోలీసుల సహకారంతో రెవెన్యూ, మైనింగ్ సిబ్బంది భారీ యంత్రాల సాయంతో తవ్విన చోట తవ్వకుండా మట్టిని తవ్వి తీస్తున్నా, నిధి జాడ మాత్రం కానరాలేదు. మూడు రోజుల క్రితం ఓ సొరంగం కనిపించిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దాన్ని పూర్తిగా పరిశీలిస్తే, లోపల కొన్ని ఆస్థి పంజరాలు కనిపించాయి. దీంతో షాక్ తిన్న అధికారులు, పోలీసులకు సమాచారం ఇవ్వగా, వాటిని పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించారు.

ఈ ప్రాంతంలో విలువైన లోహాలు ఉన్నట్టు అత్యాధునిక స్కానర్లు చూపిస్తుండగా, ఏపీ ప్రభుత్వం తవ్వకాలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అధికారులు ఆ లోహం ఉన్న ప్రాంతానికి చేరుకునేందుకు నానా తంటాలూ పడుతున్నారు. రాత్రీ పగలు తేడాలేకుండా పనులు సాగుతుండగా, ఈ ప్రాంత ప్రజలు సైతం ఆసక్తిగా చూస్తున్నారు. రాత్రి పూట కాపలాగా అధికారులే కూర్చుంటున్నారు. మొత్తం తవ్వకాల పనులను వీడియో తీయిస్తున్నారు.

ఈ కోటను చెన్నంపల్లి రాజులతో యుద్ధం చేసి, తమ అధీనంలోకి తీసుకున్న గుత్తి రాజులు, ఇక్కడ భారీ నిధిని దాచారని ఇక్కడి వారు బలంగా నమ్ముతుంటారు. ఇక కోటలోకి ఆస్థి పంజరాలు ఎలా వచ్చాయన్న విషయాన్ని తేల్చేందుకు పోలీసులు కేసును నమోదు చేశారు. ఎముకల అవశేషాలను ఫోరెన్సిక్ ల్యాబ్ నకు పంపారు. అవి ఎంతకాలం నుంచి ఉన్నాయన్న విషయం తేలిన తరువాత, ఆ ప్రాంతంలో కనిపించకుండా పోయిన వారి వివరాలను సేకరిస్తామని పోలీసు వర్గాలు అంటున్నాయి.

More Telugu News