Manda krishna: ట్యాంక్ బండ్ ముట్టడికి అసలు కారణం ఇదే!

  • సికింద్రాబాద్ సిక్ విలేజ్‌లో భారతి సంస్మరణ సభ
  • అక్కడే ట్యాంక్ బండ్ ముట్టడికి పిలుపునిచ్చిన మంద కృష్ణ 
  • సభ నుంచి నేరుగా బయలుదేరిన వందలాదిమంది కార్యకర్తలు

ఆదివారం రాత్రి బాగా పొద్దుపోయాక ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ట్యాంక్ బండ్ ముట్టడికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిజానికి ఈ ట్యాంక్ బండ్ ముట్టడి అప్పటికప్పుడు ఇచ్చిన పిలుపు. ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఇటీవల నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడిలో ఎమ్మార్పీఎస్ నాయకురాలు భారతి మృతి చెందారు. ఆదివారం రాత్రి సికింద్రాబాద్ సిక్ విలేజ్‌లోని దోభీఘాట్ గ్రౌండ్‌లో ఆమె సంస్మరణ సభ నిర్వహించారు.

భారతి సంస్మరణ సభకు హాజరైన మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ కోసం ప్రాణ త్యాగం చేసిన భారతి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూనే సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇక్కడి నుంచి నేరుగా ట్యాంక్ బండ్ ముట్టడికి కదలాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం మిలియన్ మార్చ్ జరిగిన చోటే లాంగ్ మార్చ్ నిర్వహించి తెలంగాణ ప్రభుత్వానికి సత్తా చూపించాలని కోరారు. 24 గంటలపాటు ట్యాంక్ బండ్‌ను ముట్టడించాలని పిలుపునిచ్చారు. దీంతో సభ నుంచి కార్యకర్తలు నేరుగా ట్యాంక్ బండ్‌ వైపు కదిలారు.  

కార్యకర్తల ర్యాలీ వెనక మంద కృష్ణ బయలుదేరారు. దీంతో సికింద్రాబాద్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్యారడైజ్ వద్ద భారీగా ట్రాఫిక్ జాం అయింది. దీంతో  పోలీసులు రంగంలోకి దిగారు. ట్యాంక్ బండ్‌కు వెళ్లే అన్ని దారులను పోలీసులు అష్టదిగ్బంధనం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు మంద కృష్ణను అరెస్ట్ చేసి కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌కు, అటునుంచి పాతబస్తీకి తరలించారు.

More Telugu News