Chennampalli Fort: గుప్త నిధి దొరికినట్టే... మరికాసేపట్లో సంచలన వార్త తెలుపనున్న ఏపీ ప్రభుత్వం!

  • నిధికి చాలా దగ్గరగా పురావస్తు అధికారులు
  • నాలుగైదు గంటల్లోనే సస్పెన్స్ వీడే అవకాశం
  • భారీ నిధి ఉందని నమ్ముతున్న ప్రజలు

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో దాదాపు ఐదు వందల ఏళ్ల క్రితం దాచిన వజ్ర వైడూర్యాలు, బంగారంతో కూడిన భారీ నిధి ఎక్కడ ఉందన్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖ అధికారులు తెలుసుకున్నట్టు సమాచారం. గత ఐదు రోజులుగా పోలీసుల సాయంతో, భారీ యంత్రాలతో ఈ ప్రాంతంలో తవ్వకాలు సాగించిన గనుల శాఖ అధికారులు నిధి ఉన్న ప్రదేశాన్ని కనుగొన్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై మరి కాసేపట్లో స్పష్టమైన ప్రకటన కూడా వెలువడుతుందని సమాచారం.

నిధి ఉన్న ప్రాంతానికి చాలా సమీపానికి అధికారులు చేరుకున్నారని, మరో నాలుగైదు గంటల్లోనే అక్కడ ఏముందన్న విషయం తెలుస్తుందని అధికారులు అంటున్నారు. చెన్నంపల్లి రాజులు, గుత్తి రాజుల మధ్య యుద్ధం ప్రారంభమైన వేళ, తమ వద్ద ఉన్న మొత్తం నిధిని, చెన్నంపల్లి కోటలోనే దాచారని ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంలో కథలు ప్రచారంలో ఉన్నాయి. విజయనగర రాజుల కాలంలో రాసులుగా పోసి అమ్మే వజ్రాలను, మణి మాణిక్యాలనూ, బంగారాన్ని దాచి, దానిపై సీసం పోశారని ఇక్కడి ప్రజలు నమ్ముతుంటారు.

ఈ ప్రాంతంలో ఎప్పుడు భారీ వర్షాలు పడినా వజ్రాల కోసం ప్రజల వేట సాగుతుండటం, కొంతమందికి వజ్రాలు దొరికినట్టు వార్తలు రావడం విదితమే. పలుమార్లు ఇక్కడ అక్రమ తవ్వకాలు కూడా జరిగాయి. కానీ, ఈ దఫా మాత్రం అత్యాధునిక సాంకేతిక పరికరాలు, మెటల్ డిటెక్టర్ల సాయంతో ప్రభుత్వమే స్వయంగా నిధిని వెలికి తీసేందుకు పూనుకున్న సంగతి తెలిసిందే. ఇక అక్కడ నిధి ఉందా? భూగర్భ స్కానింగ్ లో లోహంలా కనిపించినది ఏమిటన్న విషయమై నేడు సస్పెన్స్ వీడుతుందని తెలుస్తోంది.

More Telugu News