Prapancha Telugu Mahasabhalu: తెలంగాణాలో పుట్టిన తెలుగే అసలు సిసలు తెలుగు: ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

  1. ముఖ్య అథిదిగా పాల్గొన్న కడియం శ్రీహరి
  2. పంజాబి కవి డాక్టర్ వనిత, తమిళ కవయిత్రి డాక్టర్ సల్మలకు సన్మానం 
  3. తెలుగు అకాడమి ప్రచురించిన పుస్తకాల ఆవిష్కరణ

తెలంగాణాలో పుట్టిందే అసలు సిసలు తెలుగు అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొనారు. శనివారం సాయంత్రం పాల్కుర్కి  సోమన ప్రాంగణము  బమ్మెర పోతన్న వేదిక నుండి నిర్వహించిన సాహిత్య సభలో తెలంగాణాలో తెలుగు భాష వికాసంపై నిర్వహించిన కార్యక్రమంలో కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణాలో పుట్టి తెలుగు బాష వికాసానికి కృషి చేసిన సాహితీ మూర్తులను, వారి సాహిత్యాన్ని తెలంగాణా యాస, భాష, సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు ప్రపంచ తెలుగు మహా సభలను జరుపుతునట్లు తెలిపారు. 

తెలుగు బాషకు, పాటకూ తెలంగాణా సామాజిక చైతన్యానికి విడదీయలేని సంబంధం ఉన్నదని అన్నారు. అమ్మ నోటి పదాల నుండి  పల్లె పాటను, ఆనాటి వీధి నాటకాలు యక్ష గానాలు, ఉద్యమ పాటలు తెలంగాణా తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయని అన్నారు. బండి యాదగిరి రాసిన 'బండెనక బండికట్టి', సుద్దాల హనుమంతు రాసిన 'పల్లెటూరి పిల్లగాడ', గద్దర్ పాడిన 'పొడుస్తున పొద్దు మీద', గోరటి వెంకన్న పాడిన 'నాగేటి సాల్లలో నా తెలంగాణా', గూడ అంజయ్య రాసిన 'ఊరు మనదిరా' లాంటి పాటలు తెలంగాణా ప్రజలను ఉద్యమ బాట పట్టించి, ఉద్యమానికి సైరన్ లా పనిచేశాయి.. అటువంటి మహనీయులను గౌరవించి, తెలుగు వైభవానికి కృషి చేయడమే ప్రభుత్వ సంకల్పం అన్నారు. 

అనేక నిర్బంధాలను, వివక్షను తట్టుకొని తెలంగాణాలో తెలుగు భాష నిలిచిందని తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్ వి సత్యనారాయణ తన ఉపన్యాసంలో తెలిపారు. మహారాష్ట్ర నుండి వ్యాప్తి చెందిన సంఘ సంస్కరణ ఉద్యమం, గ్రంధాలయాలు, ప్రచురణ సంస్థలు, కాంఘి బడులు, ఉద్యమాలు తెలుగు భాషను కాపాడినట్లు తెలిపారు. తెలుగు భాష కోట్లాది రతనాల వీణ అని పేర్కొన్నారు. విస్మరించబడిన గ్రంథాలు, కవులు, శాసనాలను వెలికి తీయాలి అని అన్నారు.

తెలంగాణా రాష్ట్ర ఉద్యమానికి మూలం మన భాషకు సంస్కృతి కి జరిగిన అన్యాయమేనని డాక్టర్ ముధిగంటి సుజాత రెడ్డి చెప్పారు. నన్నయ కంటే నూరు సంవత్సరాల ముందే పదవ శతాబ్దంలోనే ముధిగొండ చాళుక్యులు క్రీస్తుశకం 935 లో తెలుగులో శాసనాలు వేయించారని, క్రీస్తుశకం 945లో కండ్య పద్య శాసనాలు వేశారని, సుమతి శతకం రచన వేములవాడ చాళుక్యుల కాలంలో జరిగిందని మొదటి తెలుగు కవయిత్రి మొల్ల మనకే చెందుతుందని తెలిపారు.  

తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు డాక్టర్ ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, తెలంగాణా సాహిత్య అకాడమి అధ్యక్షులు నందిని సిధారెడ్డి పాల్గొనారు. ఈ  సందర్భం గా కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత (2010), పంజాబి కవి డాక్టర్ వనిత, తమిళ కవయిత్రి డాక్టర్ సల్మలను ఉపముఖ్యమంత్రి సత్కరించారు. తెలుగు అకాడమి ప్రచురించిన పుస్తకాలను ఆవిష్కరించారు.

బమ్మెర పోతన్న వేదికపై సాంస్కృతిక సమావేశం:  శివ తత్వాన్ని ఆలపించిన తనికెళ్ళ భరణి
విశ్వ భాషలందు తెలుగు భాష లెస్స కావాలని రాష్ట్ర శాసన సభాపతి సిరికొండ మధుసూదనా చారి ఆకాంక్షించారు. శ్రమ జీవికి.. పనికి, పాటకు విడదీయలేని బంధం ఉన్నదని పేర్కొన్నారు, తెలుగు భాషకు, కాకతీయులకు వారసులమని అన్నారు మరు జన్మ ఉంటే తెలంగాణాలో తెలుగు వాడిగా పుట్టాలని కోరుతున్నట్లు తెలిపారు. ఎల్ బి స్టేడియం బమ్మెర పోతన్న వేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.


గౌరవ అతిథిగా పాల్గొన్న తనికెళ్ళ భరణి మాట్లాడుతూ ఏలికయే గురువుకు పాదాక్రాంతుడైన సంఘటన ప్రపంచ తెలుగు మహా సభల గొప్పతనాన్ని ప్రతిబింబించినట్లు అన్నారు. బంగారు తెలంగాణా సాధనకు ముఖ్యమంత్రి చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ పాడిన పాట సభికుల ప్రశంసలు పొందింది. శివ తత్వాన్ని బోధిస్తూ పాడిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, శాసన మండలి అధ్యక్షులు స్వామి గౌడ్ , నందిని సిధారెడ్డి, అయాచితం శ్రీధర్, కే వి రమణాచారి పాల్గొన్నారు. ఈ సందర్భం గా డాక్టర్ భీమన్, పేరిణి ప్రకాష్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన పేరిణి లాస్యం ఆకట్టుకుంది.



More Telugu News